Controversial cricketers : క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు జెంటిల్మెన్ లాగానే వ్యవహరించాలి. అంతేతప్ప మైదానంలో అడ్డగోలుగా వ్యవహరించి.. మైదానం వెలుపల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. కెరియర్ నాశనం అవుతుంది. అలా కెరియర్ కోల్పోయిన ఆటగాళ్ళే వీళ్ళు.
వినోద్ కాంబ్లీ
అన్ని బాగుంటే సచిన్ టెండూల్కర్ లాగా కీర్తి ప్రతిష్టలు అందుకోవాల్సిన క్రికెటర్ ఇతడు. కానీ వివాదాస్పద ప్రవర్తన.. వైవాహిక సమస్యలు.. క్రమశిక్షణ లేకపోవడం.. మైదానం లోపల బలహీనతలు వంటివి వినోద్ కాంబ్లీ కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అతడు అర్ధాంతరంగా క్రికెట్ కు దూరం కావలసి వచ్చింది. వాస్తవానికి అతడు సచిన్ కంటే మెరుగైన క్రికెట్ ఆడేవాడు. కానీ అతడి ప్రవర్తన కెరియర్ ముగింపునకు కారణమైంది.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ గా డేవిడ్ వార్నర్ కు పేరుంది. టెస్ట్, వన్డే, టీ -20 ఫార్మాట్ లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడు. సంచలన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఓ సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ పై అనుచితంగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు.. బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడనే అభియోగాలు ఎదుర్కొన్నాడు. భావి కెప్టెన్ కావలసిన వాడు.. సాధారణ ఆటగాడిగా మిగిలిపోయాడు. అతడు ఎన్ని రికార్డులు సృష్టించినప్పటికీ రూట్ పై వ్యవహరించిన తీరు ఒక మాయని మచ్చలాగా మారిపోయింది.
అండ్రూ సైమండ్స్
మంకీ గేట్ వివాదంలో అండ్రూ సైమండ్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ను మైదానంలో దూషించడంతో సైమండ్స్ రకరకాల అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ వివాదం సైమండ్స్ కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత అతడు క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
జేమ్స్ పాల్కానర్
ఆస్ట్రేలియా జట్టులో విధ్వంసకరమైన ఆటగాడిగా జేమ్స్ పాల్కనర్ కు పేరు ఉంది. అయితే ఇతడు ఆట తీరు కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండేవాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడ్డాడు. ఆ ఘటనను ఇంగ్లాండు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు అతనిపై నాలుగు మ్యాచ్ లలో నిషేధం విధించింది. ఆ తర్వాత ఫాల్కనర్ తన ధోరణి మార్చుకోలేదు. ఫలితంగా అనతి కాలంలోనే తన కెరియర్ ను కోల్పోయాడు.
బెన్ స్టోక్స్
ఇంగ్లాండ్ జట్టు తరఫున అద్భుతమైన ఆటగాళ్లల్లో బెన్ స్టోక్స్ ఒకడు. టెస్ట్, వన్డే, టీ -20 అనే తేడా లేకుండా వీర విహారం చేయగలిగే ఆటగాళ్లలో స్టోక్స్ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఇతడు వివాదాల పుట్ట. ప్రతి దాంట్లో వేలు పెట్టేవాడు. అందువల్లే ఇతడిని ఇంగ్లాండ్ జట్టులో అత్యంత వివాదాస్పద ఆటగాడిగా పేర్కొంటారు. అతగాడి ప్రవర్తన చిరాకు కలిగించడంతో జట్టు మేనేజ్మెంట్ ఓ టోర్నీ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి పంపించింది. అయినప్పటికీ అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు.
రికి పాంటింగ్
ఆస్ట్రేలియా జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పాంటింగ్ కు పేరుంది. సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతడు రికార్డులు సృష్టించాడు. అయితే రికీ పాంటింగ్ తన కెరియర్ మొదట్లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మైదానంలో దూషించేవాడు. పాంటింగ్ వ్యవహార శైలి ఇబ్బంది పెడుతుండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అతడి పై చర్యలు తీసుకుంది. కొన్ని వన్డేలు ఆడకుండా దూరం పెట్టింది.
మాంటి పనేసర్
ఇంగ్లాండ్ రిజల్ట్ స్పిన్ బౌలర్ గా మాంటి పనేసర్ కు మంచి రికార్డే ఉంది. అయితే ఇతడు ఆట తీరు కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండేవాడు. ఒకసారి ఓ నైట్ క్లబ్ లో బౌన్సర్లపై దాడికి దిగాడు. దీంతో అతడు ఇంగ్లాండ్ జట్టు క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు. అనంతరం కొద్ది రోజులకు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన ప్రవర్తన తీరుతో అర్ధాంతరంగా కెరియర్ కోల్పోయాడు.
జెస్సి రైడర్
న్యూజిలాండ్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఇతడు పేరు పొందాడు. దూకుడు కలిగిన బ్యాటింగ్ తో సంచలన రికార్డులను సొంతం చేసుకున్నాడు.. న్యూజిలాండ్ జట్టుకు అనేక విజయాలు అందించాడు. అయితే ఈ ఆటగాడు మైదానం వెలుపల అనుచిత ప్రవర్తన కొనసాగించేవాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసి కొంతమంది గాయపడేందుకు కారణమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు ఇతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అతడు కెరియర్ కు ముగింపు పలికాడు.