Telangana CM Revanth Reddy తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో తన మార్కు పాలన చూసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. 400 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. మరోవైపు మూసీ ప్రక్షాళనకు అడుగు వేశారు. అయితే కొంత ఆటకం కలిగినా.. దానిని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇక ఇప్పుడు క్రీడలపై దృష్టి పెట్టారు. క్రీడారంగంలో కీలకమైన అడుగు వేయబోతున్నారు. దేశంలోనే అత్యంత ఆధునిక స్థాయిలో లక్ష మంది కూర్చునే సామర్థ్యంతో భారీ స్టేడియం(Stedium) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలో లేదా మరో ప్రాంతంలో 100 ఎకరాల్లో నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఆధునిక సదుపాయాలు..
కొత్తగా నిర్మించే స్టేడియంలో అత్యాధునిక సాంకేతికతతో క్రికెట్(Cricket), ఫుట్‌బాల్(Foot Ball) వంటి క్రీడలు నిర్వహించేందుకు అనువుగా రూపొందిస్తారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రపంచస్థాయి శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను క్రీడలకు కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం ఉన్నారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త స్టేడియం నిర్మిస్తే క్రీడలకు తెలంగాణలో ప్రాధాన్యం దక్కే అవకాశ ఉంది.
అతి పెద్ద స్టేడియం..
ప్రస్తుతం గుజరాత్(Gujarath)లోని నరేంద్ర మోదీ స్టేడియం దేశంలోనే అతి పెద్దది. ఇందులో 1.32 లక్షల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. తెలంగాణలో నిర్మించబోయే కొత్త స్టేడియం గుజరాత్ స్థాయికి తగ్గదిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మైదానం అంతర్జాతీయస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు, ఐపీఎల్ మ్యాచ్‌లకు కేంద్రంగా మారుతందని అంచనా వేస్తున్నారు.
విదేశీ పర్యటన తర్వాత..
జనవరి 13న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో 15, 16 తేదీల్లో ఆస్ట్రేలియా(Australia)లో పర్యటిస్తారు. ఈపర్యటనలో ఆ దేశంలోని క్రీడా మైదానాలు, క్రీడాకారులకు శిక్షణ విధానాలు, ప్లానింగ్ తదితర అంశాలు అధ్యయనం చేస్తారు. 16న సింగపూర్‌లో పర్యటిస్తారు. అక్కడ మల్టీ యూస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడామైదానాల నిర్వహణపై అవగాహన పెంచుకుంటారు. ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. 20 నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టేడియం నిర్మాణంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాన్ని క్రీడలకు కేంద్రంగా మార్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.