India Vs Pakistan: దాయాది పాకిస్తాన్ పై ఎటువంటి చిన్న విజయమైనా భారతీయులకు గర్వ కారణమే. అది రాజకీయ అంశమైనా, క్రీడా పోటీలు అయినా ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. విజయం కోసం చివరి వరకూ ప్రయత్నిస్తాయి. ఇక క్రికెట్ గురించి చెప్పనక్కర్లేదు. దాయాదుల జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరుదేశాలే కాదు.. ప్రపంచ దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోతాయి. బంతి బంతికి,,రన్ రన్నును ప్రేక్షకులు అస్వాదిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఒక హైఓల్టేజ్ పవర్, రెండు దేశాల్లో రగిల్చే దేశభక్తి, దాయాది దేశంపై విజయం సాధించాలన్న కసి కనిపిస్తుంది. అయితే తాజాగా జరుగుతున్న ఆసియాకప్ లో ఇటువంటి పరిస్థితే కనిపించింది.ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. విజయం భారత్ ను వరించింది. తద్వారా ఇదే వేదికపై గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఎదురైన పరాభవాన్ని ఇండియా జట్టు ప్రతికారం తీర్చుకుంది.

భారత్ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. యువకులు స్వీట్లు పంచుకున్నారు. బాణసంచా పేల్చుకున్నారు. అర్ధరాత్రి మువ్వెన్నలజెండాతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ లో అయితే యువత జాతీయ నినాదాలతో సందడిగా గడిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం భారత్ విజయంపై సంబరాలు జరిగాయి. మ్యాచ్ అద్యాంతం యువత నినాదాలతో హోరెత్తించారు. వీధుల్లో వీడియో తెరలను ఏర్పాటుచేస్తూ మ్యాచ్ ను వీక్షించారు. భారత్ బ్యాట్స్ మెన్లు పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న సమయంలో ఈలలు, గోలలతొ సందడి చేశారు. భారత్ మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకోవడంతో వీధుల్లోకి వచ్చిన జాతీయ నినాదాలు చేశారు.
దాయాది జట్టుపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న భారత్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత్ ఈ రోజు అద్భుతమైన అల్ రౌండర్ ప్రదర్శన చేసింది.గొప్ప నైపుణ్యాన్ని కనబరిచింది. భారత్ టీమ్ కు నా శుభాభినందనలు’ అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేసి భారత్ క్రీడాకారులను అభినందనలతో ముంచెత్తారు. సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్, వసీంజాఫర్, వెంకటేష్ ప్రసాద్, గౌతమ్ గంభీర్, జస్ ప్రీతమ్ బూమ్రా తదితరులు అభినందనలు తెలిపినవారిలో ఉన్నారు.