Pawan Kalyan Fans: సాధారణంగా అందరి హీరోలకు అభిమానులుంటారు. తమ హీరోను విపరీతంగా అభిమానిస్తుంటారు. ఆయన నటించిన సినిమాలు విడుదలైతే సందడి చేస్తారు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపిస్తారు. సామాజిక సేవలు చేపడుతుంటారు. తమ మనుసుకు నచ్చే హీరో కదా అని ఆయన ఆదేశాలను తుచా తప్పకుండా పాటిస్తారు. అయితే అందరు హీరోలు ఒక లెక్క పవన్ కళ్యాణ్ ఒక లెక్క అన్నట్టు ఆయన అభిమానులు భావిస్తుంటారు. తమ హీరోను భక్తితో ఆరాధిస్తుంటారు. సినిమాలతో పాటు రాజకీయంగా ఆయన ఏంచేసినా మాకిష్టమే అన్నట్టు భావిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే భక్తిని ప్రదర్శిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అదే సమయంలో హిట్లు, ప్లాఫులతో సంబంధం లేకుండా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. అటు రాజకీయాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా విశేష ప్రజాదరణ సొంతం చేసుకుంది కూడా ఆయనే. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతున్నా.. ఎటువంటి పదవులు చేపట్టకపోయినా..ఏపీలో మాత్రం ఒక రాజకీయ శక్తిగా ఉన్నారంటే పవన్ క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం పవన్ బిజీబిజీ..
ప్రస్తుతం జనసేన పార్టీని ఎన్నికల క్షేత్రంలో తీసుకెళ్లే పనిలో పవన్ బిజీగా ఉన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అటు జనాల సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నాలుగు విడతలుగా పూర్తిచేశారు. అటు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి నగదు అందించి ఉదారతను చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న సీఎం జగన్ సొంత జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర చేపట్టారు. అక్టోబరు నుంచి మరో రాష్ట్ర స్థాయి యాత్రకు సన్నద్ధమవుతున్నారు.
దేవుడిగా కొలుస్తున్న ఫ్యాన్స్
అయితే పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కూడా పోరాటం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సీఎం వంటి ట్యాగ్ లైన్లతో సోషల్ మీడియాలో సామాజిక సమస్యలు, ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. అయితే ఇలా ముందుకు సాగే క్రమంలో తమ నాయకుడు పవనే తమకు స్ఫూర్తి అని చాటిచెబుతున్నారు. ఆయన తమకు దేవుడితో సమానమంటున్నారు. ప్రస్తుతం వినాయక చవితి సమీపిస్తోంది. మండపాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన జన సైనికులకు వినూత్న ఆలోచన వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పవన్ రూపంలో దేవుడు వచ్చారని భావించి ఆయన రూపంలో వినాయక ప్రతిమను తయారుచేయించారు. కౌలు రైతు కుటుంబాలకు సాయమందించే దృష్యాలతో పోలిన విధంగా విగ్రహాలను రూపొందిస్తున్నారు. మా నాయకుడు మహా శిఖరం అని భావన వచ్చేలా వినాయక మండపాలను పవన్ రూపంలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ విశాఖలో కనిపించిన ‘భక్తి’ పారవశ్యం మున్ముందు ఇతర ప్రాంతాలకు పాకినా ఆశ్యర్యపోనవసరం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.