Gambhir comments on Sanju Samson performance: టీమిండియా టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వెళ్ళింది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో పోటీ పడబోతోంది. ఆదివారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్(97*) కీలక భూమిక పోషించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ.. సెంచరీ కాని సెంచరీ చేసి అదరగొట్టాడు సంజు శాంసన్.
97 పరుగులు చేయడం ద్వారా సంజు తనలో ఉన్న అసలు సిసలైన పోరాట యోధుడిని బయటపెట్టాడు. ఎవరైతే తనను విమర్శించారో.. వారే ప్రశంసించే విధంగా తన బ్యాటింగ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు. ప్రారంభం నుంచి చివరిదాకా ఒకే తరహాలో బ్యాటింగ్ చేశాడు . కొన్ని సందర్భాలలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత దూకుడు కొనసాగించాడు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. తనదైన షాట్ లతో ఆకట్టుకున్నాడు. బౌండరీ లతోపాటు.. సిక్సర్లు కూడా కొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు, టి20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి.. అదరగొట్టాడు.
సంజు శాంసన్ చూపించిన పోరాటాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఒక్కడే జట్టు భారాన్ని భుజాల మీద మోయడాన్ని గొప్పగా చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆడిన అతడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారంలో ఉన్నాడు. అయితే అతడి తెగువ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు గొప్పగా కనిపించడం లేనట్టుంది. ఎందుకంటే టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత.. సంజు శాంసన్ గురించి గౌతమ్ గంభీర్ తక్కువగా మాట్లాడాడు. టీమ్ ఇండియా గెలుపులో శివం దుబే.. తిలక్ వర్మ.. సూర్య కుమార్ యాదవ్ పాత్ర ఉందని.. వారితోపాటు సంజు శాంసన్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ చెప్పుకునే స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. శివం దుబే చివర్లో వచ్చి బౌండరీలు కొట్టాడు. తిలక్ వర్మ కీలకమైన దశలో అవుట్ అయ్యాడు. కానీ సంజు ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే స్థాయిలో ఆడాడు. వెస్టిండీస్ బౌలర్ల పై తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా కొనసాగించాడు. బౌండరీలు.. సిక్సర్లు మాత్రమే కాకుండా.. స్ట్రైక్ రొటేట్ చేయడంలో.. సింగిల్స్ తీయడంలో తన నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. అందువల్లే అతడు గొప్ప పరిణితిని ప్రదర్శించాడు. ఈ స్థాయిలో అతడు ఆడినప్పటికీ.. గౌతమ్ గంభీర్ గొప్పగా కీర్తించలేకపోయాడు. టీమిండియా గెలుపులో సంజు శాంసన్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు.
ఒకవేళ అభి షేక్ శర్మ.. సూర్య కుమార్ యాదవ్.. రింకు సింగ్.. శివం దుబే కనక సంజు శాంసన్ మాదిరిగా బ్యాటింగ్ చేసి ఉంటే గౌతమ్ గంభీర్ మాట్లాడే మాటలు.. ఆయన వ్యవహార శైలి మరో విధంగా ఉండేది. సంజు శాంసన్ విషయంలో మొదటినుంచి కూడా గౌతమ్ గంభీర్ సవతి తల్లి మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు. అతనికి అవకాశాలు ఇవ్వడంలో.. తుది జట్టు లో చోటు కల్పించడంలో.. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో సంజు కేవలం డగ్ ఔట్ కు మాత్రమే పరిమితమవుతున్నాడు. రింకు సింగ్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో సంజు శాంసన్ కు జట్టులో చోటు లభించింది. వచ్చిన అవకాశాన్ని సంజు సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. సెమీ ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఒకవేళ సెమీఫైనల్ లో.. సంజు ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే.. పరుగుల వరద పారిస్తే.. అతనికి జట్టులో స్థానం మరింత సుస్థిరమవుతుంది.