T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ సందడి మొదలైంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జట్లు అమెరికా చేరుకున్నాయి. అక్కడ సాధన ప్రారంభించాయి. టీమిండియా తరఫునుంచి తొలి బృందం అమెరికా వెళ్లిపోయింది.. కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, గిల్, ఇతర యువ క్రికెటర్లు అమెరికా బయలుదేరి వెళ్లారు.. అయితే తొలి బృందంలో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కనిపించలేదు. పైగా వీరికి ఐపీఎల్ మ్యాచ్లు కూడా లేవు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ కి అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. అతడు వెళ్లలేదు. అతడి వీసా కు సంబంధించిన కొంత వర్క్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు మొదటి బృందంతో కలిసి అమెరికా వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. మే 30న అతడు అమెరికా వెళ్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. జూన్ 1న బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్ లో టీమిండియా తలపడుతుంది. ఇక విరాట్ కోహ్లీ ఇటీవల హైదరాబాద్లో తన సొంత రెస్టారెంట్ ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ప్రదర్శించాడు.. ఆరెంజ్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు టీం ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అమెరికా వెళ్ళలేదు. అతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ తన భార్య నటాషాతో విడిపోయినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అతడు లండన్ వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ 17వ సీజన్లో ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయలేదు. దీంతో హార్దిక్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి విడాకుల వార్తలు కూడా తోడు కావడంతో అతడు వార్తల్లో వ్యక్తయ్యాడు. పైగా అతడు లండన్ ఎందుకు వెళ్లాడనేది తెలియడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా లండన్ నుంచి నేరుగా అమెరికా వెళ్తాడని తెలుస్తోంది.