Buchi Babu tournament : వన్డే, టీ 20 ఫార్మాట్ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ మునుపటి ప్రభను కోల్పోతోంది. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తెరపైకి వచ్చింది. భారత జట్టు అటు వన్డే, ఇటు టీ – 20 లలో సత్తా చాటింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. ఇటీవలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించింది. వాటిని అమలు చేయడం మొదలుపెట్టింది.. టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్లు రాణించాలంటే ముందుగా రంజీ క్రికెట్లో సత్తా చాటాలని.. అప్పుడే టెస్ట్ జట్టులో అవకాశాలు కల్పిస్తామని చెప్పింది..
దులీప్ ట్రోఫీ లో మార్పులు, చేర్పులు
త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలో అనేక మార్పులు చేర్పులు చేపట్టిన బీసీసీఐ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి వారికి విశ్రాంతి ఇచ్చి, మిగతావారిని అందులో ఆడిస్తోంది. ఈ టోర్నీలో ఆడే జట్లకు ఇండియా ఏ, బీ, సీ, డీ లుగా విభజించింది. సెప్టెంబర్ ఐదు నుంచి ఈ టోర్నీ మొదలుకానుంది. దీనికంటే ముందు బుచ్చిబాబు టోర్నమెంట్ మొదలైంది. దేశవాళీ క్రికెట్లో బుచ్చిబాబు టోర్నమెంటుకు ప్రత్యేకమైన పేరు ఉంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్నారు. 2024 రంజీ ట్రోఫీ తర్వాత బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆశించినంత స్థాయిలో ఆరంభాలను ఇవ్వలేకపోయారు.
ముంబై జట్టు తరఫున బరిలోకి దిగారు
ముంబై జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్ , సూర్య కుమార్ యాదవ్ బరిలోకి దిగారు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్ లో వారు తమ రేంజ్ కు తగ్గట్టుగా ఆట తీరును ప్రదర్శించలేకపోయారు.. శ్రేయస్ అయ్యర్ మూడు బంతుల్లో రెండు రన్స్ మాత్రమే చేశాడు. సాయి కిషోర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 38 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుతిరిగాడు. ముంబై జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 58.5 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 137 రన్స్ చేసింది. ముంబై బ్యాటర్లలో సక్సేనా అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన తమిళనాడు 117.3 ఓవర్లలో 379 రన్స్ చేసి, ఆల్ అవుట్ అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో తలపడాలంటే కచ్చితంగా టీం ఇండియా వచ్చే పది టెస్ట్ మ్యాచ్ లలో తన స్థాయికి తగ్గట్టుగా ఆట తీరు ప్రదర్శించాలి. టీమిండియా అలా ఆడాలంటే ఆటగాళ్లు కచ్చితంగా తన ప్రతిభకు పదును పెంచుకోవాలి. అలా ఉన్న వారికి మాత్రమే జట్టులో అవకాశం ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది.
జట్టులో స్థానం సంపాదించుకునేందుకు..
జట్టులో స్థానం సంపాదించుకునేందుకు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ టోర్నీ తోపాటు, దులీప్ ట్రోఫీలోనూ ప్రతిభ చూపి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. అయితే వారు అనుకున్నట్టుగా ఆట తీరు ప్రదర్శించలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సూర్య కుమార్ యాదవ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడి, 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More