Team India Coach : కొన్ని రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కొంతమంది బిసిసిఐ అధికారుల సమక్షంలో ఒక సమావేశం జరిగింది. మీడియా నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను ఇచ్చే అంశాన్ని పరిగణించారు. ప్రధాన కోచ్ కాకుండా టీమ్ ఇండియాకు ప్రస్తుతం అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డ్యూష్ రూపంలో ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారు. మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. కానీ భారత జట్టుకు ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ లేరు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. బిసిసిఐ అధికారులు, జట్టు నిర్వహణ మధ్య చర్చల తర్వాత టీం ఇండియా బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికి బ్యాటింగ్ కోచ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతో సహా చాలా మంది ఆటగాళ్లు బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు. నివేదిక ప్రకారం.. ఈ పదవికి చాలా మంది పేర్లు పరిశీలించబడ్డాయి. కానీ ఇంకా అధికారికంగా ఎవరి పేరును ఖరారు చేయలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓడిపోయిన తర్వాత.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ లను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. ముఖ్యంగా అభిషేక్ నాయర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం అభిషేక్ నాయర్ జట్టుకు ఎంత సహకారం అందించాడని ఆటగాళ్లను అడిగారు. అదేవిధంగా, ర్యాన్ పై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అనుభవం కారణంగా… తక్కువ అనుభవం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆటగాళ్ల పనితీరును మెరుగుపరచడంలో తను ఎలా సహాయపడగలడనే ప్రశ్నలు అతని సామర్థ్యం మీద తలెత్తుతున్నాయి? ర్యాన్ నెదర్లాండ్స్ తరఫున ఆడాడు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 57 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రికార్డు ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం బ్యాట్స్ మెన్ వైఫల్యం కారణంగానే టీం ఇండియా చేతులెత్తేసింది. రోహిత్ శర్మ దారుణంగా ఆడాడు. కనీసం అన్ని మ్యాచులలో కలిపి కూడా 100పరుగులు చేయలేకపోయాడు. అలాగే విరాట్ కోహ్లీ సైతం పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో వీరిద్దరూ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.