Team India Coach: టీమిండియాకు త్వరలోనే కొత్త కోచ్ రాబోతున్నట్టు సమాచారం. త్వరలోనే కోచ్ పదవికి గుడ్ బై చెప్పేందుకు రవిశాస్త్రి రెడీ అయినట్టు క్రికెట్ వర్గాల నుంచి తెలుస్తోంది. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ తో రవిశాస్త్రి కోచ్ పదవీకాలం ముగుస్తోంది. ఈ క్రమంలోనే కోచ్ గా కొనసాగేందుకు ఆయన విముఖత చూపించినట్టు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలతో కూడా కొత్త కోచ్ కోసం వెతుక్కోవాలని తాజాగా స్పష్టం చేసినట్లు సమాచారం.
రవిశాస్త్రి(Ravi Shastri) ఇక టీమిండియా కోచ్ గా కొనసాగకూడదని డిసైడ్ అయిన నేపథ్యంలో కొత్త కోచ్ వేటలో బీసీసీఐ పడింది. త్వరలోనే కోచ్ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం రవిశాస్త్రితోపాటు టీమిండియా బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా వైదొలగనున్నారు. 2017లో రవిశాస్త్రితోపాటు వీరు కూడా ఎంపికయ్యారు. 2019లో పదవికాలం ముగిసినా కూడా బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగించింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి పదవీకాలం ఉంది. ఆ తర్వాత ఆయన రిటైర్ కానున్నాడు.
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ జరుగనుంది. దీని అనంతరం రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా తప్పుకోనున్నాడు. కెప్టెన్ కోహ్లీ ప్రపంచకప్ లో టీమిండియా కనుక కప్ గెలవకపోతే వైదొలిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈటీ20 కప్ యే కోచ్, కెప్టెన్ లకు కీలకంగా మారింది.
ఇక టీమిండియా కొత్త కోచ్ రేసులో గన్ షాట్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యే అావకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా.. జూనియర్ టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ సత్తా చాటుతున్నాడు. దీంతో ద్రావిడ్ టీమిండియాకు కోచ్ కావడం ఖాయమని తెలుస్తోంది.