India vs Bangladesh – Rohit Sharma : చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తొలి టెస్ట్ ఆడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసి.. వెంట వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా భారత జట్టును ఆదుకున్నారు. పటిష్టమైన స్థితిలో నిలిపారు. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), గిల్(0), రాహుల్ (16) దారుణంగా విఫలమయ్యారు.. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ, రవీంద్ర జడేజా ఆఫ్ సెంచరీ, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేయడంతో టీమ్ ఇండియా పడి లేచిన కెరటం లాగా నిలబడింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఒకానొక దశలో టీమిండియా 144/6 వద్ద ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆదుకున్నారు. ఏడో వికెట్ కు ఏకంగా 199 పరుగులు జోడించారు. దీంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 149 పరుగులకు ఆల్ అవుట్ అయింది..
రోహిత్ శర్మకు ఏమైంది
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లోనూ వన్డే తరహా బ్యాటింగ్ చేసేవాడు. అయితే గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంలో విఫలమవుతున్నాడు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. అదే జోరు బంగ్లాదేశ్ పై కొనసాగిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తడబడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు చేసిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు పరుగులకే ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు హసన్ మహమ్మద్ బౌలింగ్లో రోహిత్ ఔట్ అయ్యాడు. ఇక రెండవ టస్కిన్ బౌలింగ్ లో జకీర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ మినహా మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో అశ్విన్ 113, జడేజా 86 పరుగులు చేయడంతో భారత్ నిలబడింది. ప్రస్తుతం రెండవ ఇన్నింగ్స్ లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ పది పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. గిల్(33), రిషబ్ పంత్ (12) క్రీజ్ లో ఉన్నారు. భారత్ ప్రస్తుతానికి 308 పరుగుల లీడ్ లో ఉంది. మూడో రోజు మరో 200 పరుగులు చేసి.. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భారత జట్టు భావిస్తోంది. అయితే పిచ్ అనూహ్యంగా టర్న్ అవుతున్న నేపథ్యంలో ఎంత స్కోర్ నమోదవుతుందనేది ఉత్కంఠ గా మారింది.