IND VS BAN Test match : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18.. ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా.. కాన్పూర్ విజయంతో తొలి జట్టుగా ఆవిర్భావం

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది..2-0 తేడాతో బంగ్లాదేశ్ జట్టును మట్టికరిపించింది. స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. దర్జాగా ట్రోఫీని అందుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 5:20 pm

consecutive Test series wins at home

Follow us on

IND VS BAN Test match :  బంగ్లాదేశ్ జట్టు పై సాధించిన విజయం ద్వారా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. కాన్పూర్ మైదానం వేదికగా ప్రారంభమైన రెండవ టెస్టులో మొదటి రోజు వర్షం వల్ల కొన్ని ఓవర్ల పాటే ఆట సాగింది. వర్షం తగ్గకపోవడంతో రెండు, మూడు రోజుల్లో ఆట సాగలేదు. దీంతో నాలుగో రోజైన సోమవారం మ్యాచ్ మొదలుపెట్టారు. మొదటి ఇన్నింగ్స్ పున: ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 233 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా రికార్డు స్థాయిలో పరుగులు రాబట్టింది. టి20 తరహాలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా 285/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండవ బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 146 పరుగులకే కుప్ప కూలింది ఫలితంగా భారత్ ఎదుట 95 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఆ టార్గెట్ ను టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా టీమిండియా ఆస్ట్రేలియా జట్టు రికార్డును బద్దలు కొట్టింది. స్వదేశంలో అత్యధిక వరుస టెస్టు సిరీస్ విజయాలను సాధించిన జట్టుగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా కొనసాగింది. 1994 నుంచి 2000 వరకు ఆస్ట్రేలియా స్వదేశంలో జరిగిన ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోలేదు. అప్పుడు ఆస్ట్రేలియా వరుసగా పది టెస్టు సిరీస్ విజయాలను దక్కించుకుంది అయితే ఆ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. 2013 నుంచి 2024 వరకు టీమిండియా వరుస టెస్ట్ సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. టీమిండియా ఏకంగా 18 టెస్ట్ సిరీస్ విజయాలను సొంతం చేసుకోవడం విశేషం. 2004 నుంచి 2008 వరకు ఆస్ట్రేలియా స్వదేశంలో వరుసగా 10 టెస్టు విజయాలను దక్కించుకుంది. 1976 నుంచి 1986 వరకు వెస్టిండీస్ వరుసగా ఎనిమిది టెస్ట్ విజయాలను సొంతం చేసుకుంది. 2017 నుంచి 2020 వరకు న్యూజిలాండ్ జట్టు ఎనిమిది టెస్టు విజయాలను దక్కించుకుంది.

నాలుగో స్థానంలో టీమిండియా..

కాన్పూర్లో విజయం సాధించిన అనంతరం.. టెస్ట్ లలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టును అధిగమించింది. 414 టెస్టు విజయాలతో ఆస్ట్రేలియా ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 397 గెలుపులతో ఇంగ్లాండు రెండవ స్థానం, 183 విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానం, 180 విక్టరీలతో భారత్ నాలుగో స్థానం, 179 గెలుపులతో దక్షిణాఫ్రికా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే త్వరలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను దృష్టిలో పెట్టుకొని ఆడే అన్ని టెస్ట్ మ్యాచ్ లను గెలవాలని టీమిండియా భావిస్తోంది.