Vijay Sethupathi: సౌత్ ఇండియా లో విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న అతి కొద్దిమందిలో ఒకరు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). కెరీర్ ప్రారంభంలో ఈయన క్యారక్టర్ రోల్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. హీరో అవ్వడానికి చాలా సమయమే పట్టింది. వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వెళ్లిన విజయ్ సేతుపతి హీరో గా తమిళనాట ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో నటించాడు. కేవలం హీరో గానే ఉండిపోవాలని ఆయన కోరుకోలేదు. పలు సినిమాల్లో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. హీరోగా కెరీర్ లో మంచి విజయాలు వస్తున్న సమయంలోనే, ఆయన ధైర్యం చేసి రజినీకాంత్ పేట సినిమాలో విలన్ గా నటించాడు. ఆ తర్వాత మాస్టర్, జవాన్, ఉప్పెన వంటి చిత్రాల్లో కూడా విలన్ గా నటించాడు. మాస్టర్ సినిమాతో తెలుగు లో కూడా విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఒక విధంగా ఆ సినిమా ఇక్కడ హిట్ అయ్యిందంటే అందుకు కారణం విజయ్ సేతుపతి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘మహారాజ’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం ఇండియా లో మాత్రమే కాదు, చైనా దేశంలో కూడా ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఓటీటీ లో కూడా అత్యధిక వారాలు ట్రెండ్ అయిన సినిమాగా ఈ చిత్రం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇది ఇలా ఉండగా విజయ్ సేతుపతి చేసిన ఒక మంచి కార్యం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినీ కార్మికుల ఉన్నతి కోసం విజయ్ సేతుపతి దాదాపుగా కోటి 20 లక్షల రూపాయిలు విరాళం అందించాడట. ఈ డబ్బులను సినీ కార్మికులకు గృహాలు నిర్మించడానికి ఉపయోగిస్తున్నారట.
ఈ గృహాలకు విజయ్ సేతుపతి పేరు పెడుతున్నారట. ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ఎంతో గర్వంగా భావిస్తూ పోస్టులు పెడుతున్నారు. కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా విజయ్ సేతుపతి చేసిన ఈ మంచి పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఈ ఒక్క మంచి కార్యమే కాదు, గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ముఖ్యంగా కరోనా సమయంలో విజయ్ సేతుపతి అందించిన సేవలు తమిళ ప్రజలు అంత తేలికగా మరిచిపోలేరు. ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం కృతిక ఉదయ్ నిధి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘విడుదల 2’ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు, తదుపరి వచ్చే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టాలని కోరుకుంటున్నారు.