Afghanistan Vs South Africa Semi Final: ఆఫ్ఘనిస్తాన్ మ్యాజిక్ చేయలేకపోయింది. సూపర్ -8 లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల పై ప్రదర్శించిన మాయాజాలాన్ని పునరావృతం చేయలేకపోయింది.. సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్న కాబూలీలు.. సెమీస్ మ్యాచ్లో చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు దాసోహమయ్యారు. గుర్బాజ్(0), నూర్ అహ్మద్(0), నబీ(0) ఇలా ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుతిరిగారంటే.. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీం జద్రాన్(2), ఖరోటే(2), కరీమ్ జనత్(8), రషీద్ ఖాన్ (8), గుల్బాదిన్(9), అజ్మతుల్లా (10) పూర్తిగా నిరాశపరచడంతో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే కుప్ప కూలింది.. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్, షమ్సీ తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు. రబాడా, నోర్ట్జే చెరో రెండు వికెట్లు పడగొట్టారు..
వాస్తవానికి ట్రినిడాడ్ మైదానం చాలా కఠినంగా ఉంటుంది. రాత్రిపూట మంచు కురవడం వల్ల బంతి స్వింగ్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మైదానంలో పరిస్థితిని అంచనా వేయకుండానే, టాస్ గెలిచి బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. అది ఎంత తప్పుడు నిర్ణయమో తర్వాత గాని అతనికి అర్థం కాలేదు.. ఆప్ఘాన్ తొలి ఓవర్ చివరి బంతికే గుర్బాజ్ (0) పరుగులకే జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పుడు ప్రారంభమైన వికెట్ల పతనం క్రమం తప్పకుండా కొనసాగింది.. ఒకానొక దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇబ్రహీం జద్రాన్, నబీ (మూడో ఓవర్ లో కేవలం మూడు బంతుల వ్యవధిలో) అవుట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కనీసం 50 పరుగులైనా చేయగలుగుతుందా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తం అయింది. ఈ దశలో రషీద్ ఖాన్ కాసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది.
ఇక 57 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసి, 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అయిదు పరుగులకే ఫారూఖీ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ.. రీజా హెండ్రిక్స్(29), కెప్టెన్ మార్క్రం (23) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేసింది. ఈ గెలుపు ద్వారా దక్షిణాఫ్రికా తొలిసారి టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది. 2014లో దక్షిణాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరింది.. ఆ తర్వాత పదేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు దక్షిణాఫ్రికా t20 వరల్డ్ కప్ లో రాణించింది.. బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్ పై అన్ని విభాగాలలో పై చేయి సాధించింది.. టి20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా – ఆఫ్ఘనిస్తాన్ నాలుగుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు కూడా దక్షిణాఫ్రికా గెలిచింది.. తాజాగా గురువారం జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ – దక్షిణాఫ్రికా పరస్పరం తలపడగా.. ఈసారి కూడా దక్షిణాఫ్రికా గెలి చేసింది. మొత్తానికి గత ట్రాక్ రికార్డును కంటిన్యూ చేసింది..
ఇక ఈ ఓటమి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాస్తవానికి ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ.. ఉన్న కొద్దిపాటి అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కఠోర సాధన తో మైదానంలో చెమటోడ్చారు. క్రికెట్ ఆడొద్దన్న తాలిబన్లను ఒప్పించి మరీ.. తమ ప్రతిభను నిరూపించుకున్నారు. టి20 వరల్డ్ కప్ లో తొలిసారి సెమీఫైనల్ దాకా వచ్చారు. సూపర్ -8 లో బలమైన ఆస్ట్రేలియాను, లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును మట్టికరించారు. సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం తేలిపోయారు. దక్షిణాఫ్రికా ముందు తలవంచారు.