Pakistan Cricket Team : ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో ఆడే జట్లు అన్ని విధాలుగా సంసిద్ధమై వస్తూ ఉంటాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాతే మైదానంలోకి దిగుతాయి. అదేం దరిద్రమో తెలియదు గాని.. పాకిస్తాన్ వీటన్నింటికీ పూర్తి విరుద్ధం. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికీ తెలియదు. పైగా కెప్టెన్ మాట చెల్లుబాటు కాదు. ఏదో ఆడుతున్నాం.. అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలుస్తున్నాం అనే సామెత తీరుగానే వాళ్ల ఆట తీరు కొనసాగుతోంది. ప్రపంచంలో ఉన్న జట్లు మొత్తం ఆటగాళ్లకు ఫిట్ నెస్ ఆధారంగా స్క్వాడ్లో చోటు ఇస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ పాటించకుండా ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ఉదాహరణే అజాం ఖాన్ ను కీపర్ గా ఎంపిక చేయడం.. కీపర్ గా పనికొస్తాడని ఇంగ్లాండ్ సీరీస్ లో ఎంపిక చేస్తే గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లను అవుట్ చేయకుండా మైదానంలో వినోదం చూశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో సున్నా చుట్టి వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ జట్టులో లోపాలు ఎన్నో ఉన్నాయి. ఆ లోపాలను ఆటగాళ్లు సరిదిద్దుకోలేరు. జట్టు మేనేజ్మెంట్ సరిదిద్దలేదు.
ఇక టి20 వరల్డ్ కప్ లో అనామక అమెరికా చేతిలో ఓటమిని ఎదుర్కొంది పాకిస్తాన్ జట్టు. ఈ ఓటమి ద్వారా సూపర్ -8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అమెరికా చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ జట్టుకు చెందిన మాజీ క్రీడాకారులు పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” టి20 వరల్డ్ కప్ లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. కనీసం ఏ జట్టుతో ఓడిపోతున్నామని సోయి కూడా లేకుండా పోయిందని” దుయ్యబడుతున్నారు.
అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఆ జట్టులో కొంతకాలంగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారట. ముఖ్యంగా మహమ్మద్ అమీర్, బాబర్ అజాం మధ్య సఖ్యత లేదట. అమీర్ ఇచ్చిన సలహాలను బాబర్ అజాం పట్టించుకోవడం లేదట. అమీర్ సలహాలు పట్టించుకోకపోవడంతో అది అంతిమంగా జట్టుకు నష్టం చేకూర్చిందట. ముఖ్యంగా అమెరికా బ్యాటింగ్ సందర్భంగా 15 వ ఓవర్ లో నాలుగు పరుగులు ఇచ్చి, వికెట్ పడగొట్టిన అమీర్.. “ఈ మైదానంపై పేసర్లతోనే బౌలింగ్ చేయించాలని” సూచిస్తే.. బాబర్ అజాం పట్టించుకోలేదట. అమెరికన్ ఆటగాడు జోన్స్ స్పిన్ ఆడతాడని.. అందువల్లే పేస్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని అమీర్ మరీ మరీ చెప్పాడట. కానీ దీనిని బాబర్ పట్టించుకోలేదట. పైగా షాదాబ్ ఖాన్ తో బౌలింగ్ చేయించాడట. అతని బౌలింగ్లో జోన్స్ ఏకంగా 11 పరుగులు పిండుకున్నాడట. అమీర్ మాట వినకుండా స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించడంతో.. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుందని.. బాబర్ అజాం నిర్లక్ష్యం పరువు తీసిందని.. పాక్ అభిమానులు చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదని.. ఇలా అయితే టి20 వరల్డ్ కప్ ఏం గెలుస్తుందని వారు కామెంట్స్ చేస్తున్నారు.