T20 World Cup 2024: కివీస్ పేస్ దిగ్గజం సంచలన నిర్ణయం.. నిర్ఘాంతపోతున్న అభిమానులు

న్యూజిలాండ్ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓడిపోయింది. విలియం సన్ ఆధ్వర్యంలో కాన్వే, ఫిన్ అలెన్, పెర్గూసన్, బౌల్ట్, శాంట్నర్, సౌతి, రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ జట్టు కు పరాజయాలు తప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 8:42 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ పలు సంచలనాలకు వేదికయింది. ఈసారి పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లాయి. వాస్తవానికి ఈ రెండు జట్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాయి. పసి కూనల చేతిలో ఓడిపోయి నిరాశతో ఇంటికి వెళ్ళాయి. స్లో, ట్రిక్కి మైదానాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. వాస్తవానికి పాకిస్తాన్ జట్టును పక్కనపెడితే.. న్యూజిలాండ్ సెమిస్ దాకా వెళుతుందని చాలామంది భావించారు. కానీ గ్రూప్ దశలోనే ఈ జట్టు ఎగ్జిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

న్యూజిలాండ్ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓడిపోయింది. విలియం సన్ ఆధ్వర్యంలో కాన్వే, ఫిన్ అలెన్, పెర్గూసన్, బౌల్ట్, శాంట్నర్, సౌతి, రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ జట్టు కు పరాజయాలు తప్పలేదు. ఐతే ఈ ఓటములు ఎలా ఎదురయ్యాయి? ఎందుకు ఇలా జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో ఉంది న్యూజిలాండ్ జట్టు.. ఇదే సమయంలో ఆ జట్టు పేస్ గుర్రం ట్రెంట్ బౌల్ట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.. ఇకపై అతడు టీ 20 క్రికెట్ లో ఆడబోనని స్పష్టం చేశాడు. తనకు ఇదే చివరి టీ 20 వరల్డ్ కప్ అని స్పష్టం చేశాడు. ఉగాండా జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో బౌల్ట్ 4 ఓవర్లు వేసి, ఏడు పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు సాధించాడు..

ఉగాండా జట్టు తో జరిగిన మ్యాచ్లో గెలుపొందిన అనంతరం.. బౌల్ట్ విలేకరులతో మాట్లాడాడు. ” టి20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాను. ఎన్నో అనుభూతులు ఈ ఆట ద్వారా సొంతం చేసుకున్నాను సౌథి తో ఎన్నో అద్భుతమైన మ్యాచులు ఆడాను. చాలావరకు విజయాలలో భాగస్వామిగా నిలిచాను. అతడితో బౌలింగ్ పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. మైదానం లోపల, బయట కూడా అతనితో స్నేహం లభించడం గొప్పగా ఉందని” బౌల్ట్ ప్రకటించాడు. ఇక టి20 వరల్డ్ కప్ లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన బౌల్ట్ 32 వికెట్లు పడగొట్టాడు. ఇతడు 6.07 ఎకనామి రేటు ను నమోదు చేశాడు. టి20 క్రికెట్ చరిత్రలో ఆల్ టైం వికెట్లు పడగొట్టిన పదిమంది బౌలర్ల జాబితాలో బౌల్ట్ అత్యుత్తమ బౌలింగ్ ఎకానమీని నమోదు చేశాడు. వచ్చే ఏడాది వన్డే ఛాంపియన్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో అందులోనైనా బౌల్ట్ ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.