Saurabh Netravalkar: పాక్ పని పట్టిన సౌరవ్ నేత్రావల్కర్ కు, భారత్ కు మధ్య సంబంధమేంటంటే..

సౌరభ్ నేత్రావల్కర్ భారత మూలాలు ఉన్న ఆటగాడు. ఇతడు 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించాడు. 2010 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఆడాడు. అయితే ఇక్కడ విపరీతమైన పోటీ ఉండడంతో కెరియర్లో ఎదగలేకపోయాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 7, 2024 12:15 pm

Saurabh Netravalkar

Follow us on

Saurabh Netravalkar: టి20 ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాతో తలపడిన పాకిస్తాన్ జట్టు కోలుకోలేని పరాజయాన్ని చవి చూసింది. టి20 క్రికెట్లో స్థిరమైన స్థానం లేని అమెరికా చేతిలో ఓడిపోవడం సంచలనంగా మారింది. డల్లాస్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై అమెరికా సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికా 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. తుది ఫలితం కోసం ఎంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. పాకిస్తాన్ వికెట్ నష్టపోయి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐదు పరుగుల తేడాతో అమెరికా విజయ సాధించింది. అయితే ఈ విజయంలో సౌరభ్ నేత్రా వల్కర్ కీలకపాత్ర పోషించాడు.. ఇంతకీ ఇతని నేపథ్యం ఏంటంటే..

సౌరభ్ నేత్రావల్కర్ భారత మూలాలు ఉన్న ఆటగాడు. ఇతడు 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించాడు. 2010 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఆడాడు. అయితే ఇక్కడ విపరీతమైన పోటీ ఉండడంతో కెరియర్లో ఎదగలేకపోయాడు. ఎడమచేతి వాటంతో పేస్ బౌలింగ్ వేసే ఇతడు.. ఎలాంటి మైదానంపై నైనా వికెట్లు తీయగలడు. అద్భుతమైన బౌన్స్ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గురువారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అతడు ఇదే విధంగా ఆడాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి, బలమైన పాకిస్తాన్ జట్టు పని పట్టాడు.

సౌరభ్ 2015లో తన కెరియర్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ అమెరికా జాతీయ జట్టు లో స్థానం సంపాదించాడు.. పలు కీలకమైన టోర్నీలలో మెరిశాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన 3 టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో అదరగొట్టాడు. అమెరికా జాతీయ జట్టు తరఫున ఆడే కంటే ముందు రంజీ క్రికెట్లో ముంబై జట్టు తరఫున ఆడాడు.. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన ద్కత్, సందీప్ శర్మ వంటి వాళ్ళు సౌరభ్ టీమ్ మేట్లు. ఇతడు క్రికెట్లో మాత్రమే కాకుండా, చదువులోనూ మేటి. ఒరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేశాడు. అలా చేస్తూనే క్రికెట్లో రాణించేవాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో, సూపర్ ఓవర్లో అద్భుతంగా రాణించడంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు.