T20 World Cup 2024: ఓవైపు ఐపీఎల్ జోరుగా సాగుతుండగానే.. టి20 వరల్డ్ కప్ నకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తన 15 మంది స్క్వాడ్ ను ప్రకటించింది. మిగతా జట్లు కూడా అదే తీరుగా ఆటగాళ్ల వివరాలను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఇంతవరకు టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఆడబోయే జట్టును ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరికొద్ది గంటల్లో భారత జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం లభిస్తుంది? ఆ బృందంలో ఎవరెవరు ఉంటారోనని చాలామంది అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. అయితే ఈసారి వెస్టిండీస్, అమెరికాలో జరిగే టి20 వరల్డ్ కప్ లో ఆ నలుగురు ఆటగాళ్లకు మాత్రం అవకాశం లభించదని తెలుస్తోంది.
ముంబై జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా కు టి20 వరల్డ్ కప్ బృందంలో స్థానం లభించలేదని సమాచారం. పాండ్యా మాత్రమే కాకుండా మరో ముగ్గురు ఆటగాళ్లకు భారత సెలక్టర్లు మొండి చెయ్యి చూపారని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు యువ సంచలనం శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ కు అవకాశం కల్పించేందుకు సెలెక్టర్లు నిరాసక్తత ప్రదర్శించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ లో గిల్ మాత్రమే పరవాలేదనిపిస్తున్నాడు. సూర్య కుమార్ యాదవ్ కొడితే ఆఫ్ సెంచరీ, లేకుంటే డక్ అవుట్ అన్నట్టుగా ఆడుతున్నాడు. రింకూ సింగ్ కూడా పెద్దగా ప్రతిభ చూపలేకపోతున్నాడు. దీంతో సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు ఆ నలుగురు ఆటగాళ్లను టి20 వరల్డ్ కప్ నకు ఎంపిక చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు హార్థిక్ పాండ్యా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అటు బౌలింగ్ లోను గొప్పగా వికెట్లు తీయలేదు. 9 మ్యాచ్ లు ఆడిన అతను 197 రన్స్ చేశాడు. బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఆల్ రౌండర్ కోటాలో అతడి స్థానంలో శివం దూబే ను ఓకే చేశారని తెలుస్తోంది. ఒకవేళ శివం దూబే కాకుంటే .. రిషబ్ పంత్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి, 166 రన్స్ చేశాడు. దీంతో అతన్ని కూడా పక్కన పెట్టాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.. ఇక గిల్ 320 రన్స్ చేసినప్పటికీ అతడి స్ట్రైక్ రేట్ సెలెక్టర్లను ఆందోళనకు గురి చేస్తోందట. అందువల్లే అతనికి బదులు వేరే యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారట. ఇక రింకూ సింగ్ కూడా ఐపీఎల్ లో ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. 8 మ్యాచ్ లలో అతడు 112 రన్స్ మాత్రమే చేశాడు. వాస్తవానికి గ్రేట్ ఫినిషర్ అయిన రింకూ సింగ్.. ఈ సీజన్లో విఫలమవుతున్నాడు. దీంతో అతడిని సెలక్టర్లు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పై ఆటగాళ్లు టీం లో ఉంటారా? ఉండరా? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది.