Syed Mushtaq Ali Trophy
Syed Mushtaq Ali Trophy : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ హోరాహోరీ గా జరుగుతుంది. ఇందులో భాగంగా మణిపూర్, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని ఏగంగా 11 మందితో బౌలింగ్ చేయించాడు. టి20 క్రికెట్లో ఇలా 11 మంది తో బౌలింగ్ చేయించడం ఇదే తొలిసారి. జట్టులో ఉన్న ఆటగాళ్ల మొత్తంతో బౌలింగ్ చేయించి బదోని సరికొత్త రికార్డు సృష్టించాడు. చివరికి వికెట్ కీపర్ గా ఉన్న అతడు కూడా బౌలింగ్ చేశాడు. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అయితే ఐపీఎల్ లో దక్కన్ చార్జర్స్ ప్రస్తుత సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 మంది బౌలర్లను ఉపయోగించాయి.. అప్పట్లో అది ఒక రికార్డుగా ఉండేది. అయితే దానిని ఇప్పుడు దేశవాళి టీ20 క్రికెట్లో ఢిల్లీ జట్టు బద్దలు కొట్టింది. కెప్టెన్ ఆయుష్ ఏకంగా 11 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేయించి సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా జట్టుకు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ గెలుపు ద్వారా ఢిల్లీ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్ లలో జయకేతనం ఎగరవేసింది. 1.765 రన్ రేట్ తో 16 పాయింట్లను సాధించింది. గ్రూప్ – సీ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మణి “పూర్”
మణిపూర్ ఈ టోర్నీలో నిరాశాజనకమైన ప్రదర్శనను చేస్తోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు.. అన్ని మ్యాచ్ లు ఓడిపోయింది. -4.283 రన్ రేట్ తో గ్రూప్ – సీ లో చివరి వరుసలో రెండవ స్థానంలో ఉంది . మణిపూర్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లు ఓడిపోయి గ్రూప్ – సీ లో చివరి స్థానంలో ఉంది. మణిపూర్ ఆటగాళ్లు సరైన ఆటతీరు ప్రదర్శించ లేకపోవడం అది ఆ జట్టు విజయాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. “బౌలింగ్ మెరుగ్గా లేదు. బ్యాటింగ్ ఆసక్తిగా లేదు. ఫీల్డింగ్ అద్వానంగా ఉంది. ఇలాంటి స్థితిలో మణిపూర్ మ్యాచ్ గెలవడం అంటే సాహసమే. ప్రత్యర్థి జట్లు హోరాహోరి ఆట తీరును ప్రదర్శిస్తున్నాయి. గొప్పగా ఆడుతున్నాయి. ఇలాంటప్పుడు జట్టు ఆటగాళ్లలో మార్పు రావాలి. గెలవాలనే కసి ఉండాలి. అవేవీ మణిపూర్ జట్టులో కనిపించడం లేదు. ఇలాగైతే ఈ టోర్నీ నుంచి మణిపూర్ నిష్క్రమిస్తుంది. ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటికైనా మేలుకోవాలని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.