Surya Kumar Yadav: అప్పుడు శూన్యకుమార్ అన్నారు.. ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కొన్ని జట్లు మినహా మిగతావన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ముంబై జట్టు గురించి. ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకున్న ఈ జట్టు గత రెండు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 12:23 pm

Surya Kumar Yadav

Follow us on

Surya Kumar Yadav: బాగా ఆడినప్పుడు భుజాల మీదకి ఎత్తుకోవడం.. ఆడనప్పుడు హఠాత్తుగా కింద పడేయడం మీడియాకే కాదు అభిమానులకు కూడా అలవాటే. అందుకే మన దేశ క్రికెట్ జట్టు 2003 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై ఓడిపోయినప్పుడు శవయాత్ర చేశారు. ఆటగాళ్ల చిత్రపటాలకు చెప్పుల దండలు వేశారు. అదే జట్టు వరల్డ్ కప్ నెగ్గినప్పుడు.. టీ -20 వరల్డ్ కప్ దక్కించుకున్నప్పుడు విజయ ప్రదర్శనలు చేశారు. ఆటగాళ్లను కొనియాడారు. వారి ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అప్పుడు అభిమానుల్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కువగా ప్రదర్శించే వేదికలు లేవు. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అపరిమితమైన డేటా అందుబాటులో ఉంది. అన్నింటికీ మించి సోషల్ మీడియా కళ్ళముందే కనిపిస్తోంది. ఇంకేముంది విమర్శించినా, ఆకాశానికి ఎత్తినా జస్ట్ కామెంట్ దూరంలోనే..

ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కొన్ని జట్లు మినహా మిగతావన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ముంబై జట్టు గురించి. ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకున్న ఈ జట్టు గత రెండు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది.. అయితే ఈ సీజన్లో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ను మార్చి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం కల్పించింది. అయితే అతడి నేతృత్వంలో ముంబై వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది. దీంతో హార్దిక్ పాండ్యా పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా సూర్యకుమార్ యాదవ్ కు జట్టు యాజమాన్యం నుంచి పిలుపు వచ్చింది. అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మొన్నటిదాకా చికిత్స పొందాడు. పూర్తిగా సఫలీకృతుడు అయిన తర్వాతనే అతనిని పంపించాలని బీసీసీఐ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు ఒకటికి రెండుసార్లు సూర్యకుమార్ యాదవ్ కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి.. అందులో ఓకే అయిన తర్వాతే బయటికి పంపించారు. అలా అతడు ఇటీవలి ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తొలి మ్యాచ్లో డక్ అవుట్ గా వెను తిరిగాడు. ఇంకేముంది ట్రోల్స్ మొదలయ్యాయి. ఆరోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి ఆటగాడినా మీరు జట్టులోకి రమ్మన్నది.. అతడు ఒకప్పటి సూర్యకుమార్ కాదు. అతడు శూన్యకుమార్.. అందుకే 0 పరుగులకే అవుట్ అయ్యాడు.. అంటూ నెటిజన్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే వారు చేసిన విమర్శలు సూర్యకుమార్ చెవికి తగిలాయో.. లేక మరేమైనా అనుకున్నాడో తెలియదు గానీ.. జూలు విధిల్చిన సింహం లాగా ఒక్కసారిగా తన పూర్వపు ఆట తీరు ప్రదర్శించాడు. గురువారం నాటి బెంగళూరు మ్యాచ్ లో తన పాత బ్యాటింగ్ ను బెంగళూరు బౌలర్లకు రుచి చూపించాడు. తను శూన్యకుమార్ కాదని.. ముమ్మాటికీ సూర్య కుమార్ నేనని.. నిరూపించాడు. కేవలం 19 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అతగాడి బ్యాటింగ్ దాటికి 196 పరుగుల విజయ లక్ష్యం కాస్త.. చిన్నదయిపోయింది. అంత పెద్ద లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే చేజ్ చేసి పడేసింది. సూర్య కుమార్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. సోషల్ మీడియాలో అతని పేరు మార్మోగుతోంది. మొన్నటిదాకా శూన్యకుమార్ అన్నవారే ఇప్పుడు అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.