ChatGPT IPL: ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి మందాన ఆధ్వర్యంలోనే బెంగళూరు మహిళల టీం కప్ దక్కించుకుంది. దీంతో ఈసారి జరిగే పురుషుల ఐపీఎల్లో కచ్చితంగా బెంగళూరు టీం కప్ సాధిస్తుందని అందరూ భావించారు. అభిమానులు కూడా అదే ఆశించారు.. కానీ జరుగుతున్నది వేరు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.. ఈ క్రమంలో బెంగళూరు ఆటగాళ్లు ఆడుతున్న తీరుపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇలా ఆడితే కప్పు ఎలా దక్కుతుందనే చివాట్లు అభిమానుల నుంచి ఎదురవుతున్నాయి. అయినప్పటికీ బెంగళూరు ఆటగాళ్ల ఆట తీరు మారడం లేదు.
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కప్పు కోసం బెంగళూరు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. 2009, 2016 సీజన్లో బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ చేరింది. కానీ వెంట్రుకవాసిలో టైటిల్ కోల్పోయింది. వాస్తవానికి భీకరమైన బ్యాటింగ్ లైనప్ బెంగళూరు సొంతం.. అయినప్పటికీ ఆ జట్టు ఆ స్థాయిలో ఆడటం లేదు. ఊరించడం.. ఉసూరుమనిపించడం ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది. కోచ్ లు మారారు. ఆటగాళ్లు కొత్తవాళ్లు వచ్చారు. చివరికి కెప్టెన్ కూడా మారాడు. అయినప్పటికీ బెంగళూరు తలరాత మారడం లేదు. ఈసాల కప్ నమదే అనే నినాదం నెరవేరడం లేదు. ఫాఫ్ డూ ప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటికీ బెంగళూరు మెరుగైన ప్రదర్శన చేయలేకపోతోంది.. ప్రతి మ్యాచ్ లోనూ(పంజాబ్ తో మినహా) విఫలం అవుతూనే ఉంది. విమర్శలు మూట కట్టుకుంటున్నది.
ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ దక్కే అదృష్టమే లేదా.. అసలు ఆ జట్టులో ఉన్న ప్రధాన లోపం ఏంటి? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగితే తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రమే కాదట.. వచ్చే ఐదు సీజన్ల వరకు బెంగళూరు టైటిల్ గెలుచుకునే అవకాశం లేదట. ఇటీవల చాట్ జిపిటి వేసిన అంచనాలో 2027లో బెంగళూరు టైటిల్ గెలుస్తుందని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం 2029 వరకు బెంగళూరుకు టైటిల్ గెలిచే సత్తా లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. 2050 సీజన్ వరకు చాట్ జిపిటి ఐపీఎల్ ఛాంపియన్స్ ను అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2043 వరకు తన జోస్యం చెప్పింది. వచ్చే 20 సంవత్సరాలలో బెంగళూరు రెండుసార్లు మాత్రమే విజేతగా నిలుస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. చాట్ జిపిటి మాత్రం మూడుసార్లు గెలుస్తుందని అంచనా వేసింది. బెంగళూరు టీం బలాబలాలు.. ఇతర వనరుల ఆధారంగా ఏఐ, చాటిజిపిటి ఈ వివరాలు వెల్లడించాయి. అవి వెల్లడించిన వివరాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
Chatgpt predicts IPL winners till 2050#IPL2024 #RCBvsMI #ViratKohli pic.twitter.com/OlPkBYnhRm
— CricShiva (@shivauppala93) April 11, 2024