Sunrisers Hyderabad: ప్లే ఆప్స్ కు సన్ రైజర్స్.. మిగిలిన ఒక్క స్థానం ఎవరిది?

ఆదివారం హైదరాబాద్ పంజాబ్ జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిస్తే హైదరాబాద్ టాప్ -2 కేటగిరీలోకి వెళుతుంది. అయితే కోల్ కతా చేతిలో రాజస్థాన్ ఓటమి చవి చూడాల్సి ఉంది. ఒకవేళ పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ ప్లే ఆఫ్ వెళ్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 17, 2024 8:45 am

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: గత సీజన్లలో దారుణమైన ఆట తీరుతో పరువు పోగొట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈసారి పకడ్బందీ ప్రణాళికతో ఆడుతోంది.. ముంబై, బెంగళూరు లాంటి బలమైన జట్ల మీద ఏకంగా 277, 287 పరుగులు చేసింది. ఐపీఎల్ లో తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంది.. ప్లే ఆఫ్ ముందు కొన్ని మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ.. మళ్లీ పడి లేచిన కెరటం లాగా పుంజుకుంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో పదవి వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా గురువారం హైదరాబాద్ వేదికగా గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో..ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు అంపైర్లు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో 15 పాయింట్లతో హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది.

ఆదివారం హైదరాబాద్ పంజాబ్ జట్టుతో తలపడనుంది. ఇందులో గెలిస్తే హైదరాబాద్ టాప్ -2 కేటగిరీలోకి వెళుతుంది. అయితే కోల్ కతా చేతిలో రాజస్థాన్ ఓటమి చవి చూడాల్సి ఉంది. ఒకవేళ పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ ప్లే ఆఫ్ వెళ్తుంది. గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో బెంగళూరు, చెన్నై జట్లకు ప్రమాదకరంగా మారింది.. ఇప్పటికే ఢిల్లీ, లక్నో ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. ఇక శనివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒక రకంగా నాకౌట్ లాంటిది. బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోవాలి. లేదా 18.1 ఓవర్లలో టార్గెట్ చేదించాలి. అప్పుడే అది చెన్నై కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. ఒకవేళ చెన్నై ప్లే ఆఫ్ వెళ్లాలంటే బెంగళూరు ను ఓడించాలి. లేకుంటే తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి.

వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం బెంగళూరులో శనివారం వర్షం కురిసే అవకాశం ఉందట. ఇది బెంగళూరు అభిమానులను ఇబ్బంది పెడుతోంది. ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడి ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే బెంగళూరు ప్లే ఆఫ్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఐపీఎల్ ఫస్ట్ ఆఫ్ లో దారుణంగా ఆడిన బెంగళూరు.. సెకండ్ హాఫ్ లో తిరుగులేని సత్తా చాటింది. వేగంగా ఐదు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందు వరుసలో నిలిచింది. ఇక చెన్నై జట్టు టాప్ -2 లో నిలవాలంటే బెంగళూరు ను ఓడించాలి.. అంతేకాకుండా రాజస్థాన్, హైదరాబాద్ జట్లు తమ తదుపరి మ్యాచ్ లలో ఓడిపోవాలి. ఈ రెండింట్లో ఏ ఒక్క జట్టైనా తమ ప్రత్యర్థులపై గెలిస్తే చెన్నై జట్టు టాప్ -2 వెళ్లేందుకు అవకాశం ఉండదు.