Sunrisers Hyderabad: ఎలాగోలా కాదు.. ఐపీఎల్ నే ఏలేసేలా ఆడుతోంది ఈ జట్టు.. ప్రత్యర్థి జట్లూ తస్మాత్ జాగ్రత్త

ఒకప్పుడు హైదరాబాద్ జట్టు కేవలం బౌలింగ్ పైనే ఆధారపడేది. బ్యాటింగ్ లో తడబడేది. కానీ, ఈసారి రికార్డుల దుమ్ము దులుపుతోంది. సరికొత్త ఘనతలను సృష్టిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 21, 2024 2:37 pm

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: 2021లో 14 మ్యాచ్లు ఆడింది. కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి పరువు పోగొట్టుకుంది. 2022లో 14 మ్యాచులు ఆడి.. ఆరు విజయాలు సాధించి కాస్తలో కాస్త పరువు దక్కించుకుంది. 2023లో 14 మ్యాచులు ఆడి కేవలం నాలుగు మాత్రమే విజయాలు దక్కించుకొని.. అనామక జట్టుగా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు.. బ్యాటర్లు కొడుతుంటే బంతులు బౌండరీల అవతల పడుతున్నాయి. బౌలర్ల మెలికలకు వికెట్లు ఎగిరి పడుతున్నాయి. ఇంతలో ఎంత మార్పు.. ఈ మార్పు ఎలా సాధ్యమైంది.. ఈ ఐపిఎల్ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి.. ఐదు గెలుపొందింది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. అన్నీ బాగుంటే కోల్ కతా ను కూడా పక్కన పెట్టగలదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది హైదరాబాద్ ఆట.

ఒకప్పుడు హైదరాబాద్ జట్టు కేవలం బౌలింగ్ పైనే ఆధారపడేది. బ్యాటింగ్ లో తడబడేది. కానీ, ఈసారి రికార్డుల దుమ్ము దులుపుతోంది. సరికొత్త ఘనతలను సృష్టిస్తోంది. తనకు తాను రికార్డు సృష్టించుకుని.. తనకు తానుగానే బద్దలు పడుతోంది. బలమైన ముంబై మీద 277 పరుగులు చేసింది.. ఏదో ఉప్పల్ మైదానంలో అలా చేసిందని అందరూ అనుకున్నారు. కానీ, బెంగళూరు జట్టుపై బెంగళూరులోనే 287 పరుగులు కొట్టి.. తమది లక్ ను నమ్ముకున్న జట్టు కాదని.. హార్డ్ వర్క్ తో ఇక్కడ దాకా వచ్చిన జట్టని నిరూపించింది. అంతేకాదు టి20 లో 300 మార్క్ స్కోర్ సాధ్యమవుతుందని.. తామే దాని ని సాధ్యం చేస్తామని సంకేతాలు పంపిస్తోంది. ప్రత్యర్థి జట్టు తమను మొదట బ్యాటింగ్ కు ఆహ్వానిస్తే చాలు.. మైదానంలో ప్రళయం సృష్టిస్తోంది. తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తోంది. కోల్ కతా, గుజరాత్ జట్టుపై ఏదో తేడా జరిగి ఓడిపోయింది గాని .. లేకుంటే అంతకుమించి అనేలాగా ఆడి ఉండేది.

ఉప్పల్ మైదానంలో ముంబై ,
జట్టుపై 277 పరుగులు చేసి 11 ఏళ్ల బెంగళూరు రికార్డును బద్దలు కొట్టేసింది. అదే బెంగళూరుపై 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీపై కూడా తాండవం చేసింది. చాలామంది టి20 లో 200 స్కోరే ఎక్కువ అనుకుంటుంటే.. 300 చేస్తామని హైదరాబాద్ జట్టు సవాల్ విసురుతోంది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఇప్పటికే మూడుసార్లు 260+ స్కోర్ సాధించింది. ఢిల్లీపై 266 పరుగులు చేసినప్పటికీ హైదరాబాద్ ఆటగాళ్లు ఆశించినంత స్థాయిలో సంతృప్తిగా లేరంటే.. వారి బ్యాటింగ్ ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్ గా రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అతడు ఆస్ట్రేలియా జట్టుకు వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలు అందించాడు. ఆ సామర్ధ్యంతో ఇప్పుడు హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. హైదరాబాద్ ఆటగాళ్లలో హెడ్ వీర విహారం చేస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరిద్దరే ఇలా ఉన్నారంటే.. క్లాసెన్ బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, షాబాద్ అహ్మద్ వంటి వారు అగ్నికి ఆజ్యం పోసే విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నెరవేర్చుతుండడంతో హైదరాబాద్ జట్టుకు అడ్డే లేకుండా పోతోంది.

ఢిల్లీ జట్టుపై శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పవర్ ప్లే లో హైదరాబాద్ ఏకంగా 125 రన్స్ చేసింది. ఒకరకంగా ఇది ప్రపంచ రికార్డు. ఇప్పటికే హైదరాబాద్ ఆటగాడు హెడ్ ఒక శతకం కొట్టాడు. ఆరు ఇన్నింగ్స్ లలో 216 స్ట్రైక్ రేట్ తో 324 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 215 స్ట్రైక్ రేట్ తో 7 ఇన్నింగ్స్ లలో 257 పరుగులు చేశాడు. ఇక నితీష్ రెడ్డి మూడు ఇన్నింగ్స్ లలో 159 స్ట్రైక్ రేట్ తో 115, షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ లలో 161 స్ట్రైక్ రేట్ తో 129, సమద్ అయిదు ఇన్నింగ్స్ లలో 216 స్ట్రైక్ రేట్ తో 119 పరుగులు చేశాడు. ఇలా పరుగుల వరద పారిస్తున్నప్పటికీ హైదరాబాద్ ఆటగాడు హెడ్ సంతృప్తి చెందడం లేదు. 300 కొట్టడమే తమ లక్ష్యమని చెప్తున్నాడు. ఇప్పుడది నెరవేరక పోవచ్చు గాని.. వచ్చే మ్యాచ్లో మాత్రం కచ్చితంగా సన్ రైజర్స్ కొట్టేలాగా ఉంది. వాస్తవానికి టీ – 20 అంటేనే వినోదం. ఆ వినోదాన్ని నెక్స్ట్ లెవెల్ కు హైదరాబాద్ జట్టు తీసుకెళ్తోంది.