IPL 2024 – SRH : చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా.. అది సన్ రైజర్స్ తోనే..

2023 లో ముంబై ఇండియన్స్, అంతకుముందు సీజన్లో కోల్ కతా, బెంగళూరు జట్లు ఈ రికార్డును సృష్టించాయి. ఆ జట్ల సరసన హైదరాబాద్ నిలిచింది.

Written By: NARESH, Updated On : May 20, 2024 9:38 am

SRH

Follow us on

IPL 2024 – SRH : ఐపీఎల్ లో సన్ రైజర్స్ సరి కొత్తగా కనిపిస్తోంది. వరుస సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ఆ జట్టు.. ఇప్పుడు అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్లిపోయిన ఆ జట్టు.. లీగ్ దశలో చివరి మ్యాచ్ ను గెలిచి.. విజయవంతంగా ముగించింది. సొంత మైదానంలో పంజాబ్ జట్టు 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని విధించినప్పటికీ.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే దానిని హైదరాబాద్ జట్టు చేదించింది. మొత్తానికి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈ విజయం ద్వారా హైదరాబాద్ జట్టు మరో ఘనతను కూడా లిఖించింది.

టి20 క్రికెట్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్ టోర్నీలో 160 సిక్స్ లు కొట్టిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రికార్డును సులువుగా అధిగమించింది. ఇప్పటివరకు 157 సిక్స్ లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బెంగళూరును.. హైదరాబాద్ వెనక్కి నెట్టేసింది.

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్ జట్టుతో ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తలపడింది. ఈ చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించి.. అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు మొత్తం 14 సిక్స్ లు కొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 6 సిక్స్ లు కొట్టాడు. రాహుల్ త్రిపాఠి 2, నితీష్ కుమార్ రెడ్డి 3, క్లాసెన్ రెండు, అబ్దుల్ సమద్ ఒక సిక్స్ కొట్టాడు. ఈ జాబితాలో హైదరాబాద్ జట్టు తర్వాత బెంగళూరు (157), చెన్నై (145) ఐపీఎల్ 2018, సర్వే టీం (144 టిమ్ టీ20 బ్లాస్ట్ 2023), కోల్ కతా (143 ఐపీఎల్ 2019) జట్లు వరుస స్థానంలో కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ..సన్ రైజర్స్ జట్టు తరఫున ఒక సీజన్లో అత్యధికంగా సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్ లో అతడు 41 సిక్స్ లు కొట్టాడు.. క్లాసెన్ 33, డేవిడ్ వార్నర్ 31 (ఐపీఎల్ 2016 సీజన్) సిక్స్ లతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు..

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సార్లు 200కు మించి పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్లో హైదరాబాద్ ఆరుసార్లు 200 కు పైగా పరుగులు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 లో ముంబై ఇండియన్స్, అంతకుముందు సీజన్లో కోల్ కతా, బెంగళూరు జట్లు ఈ రికార్డును సృష్టించాయి. ఆ జట్ల సరసన హైదరాబాద్ నిలిచింది.

కాగా, ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. పంజాబ్ ఆటగాళ్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 71, అధర్వ 46, రోసౌ 49 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. చివర్లో జితేష్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేసి 32 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టాడు. విజయ్ కాంత్ ప్యాట్ కమిన్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం చేజింగ్ కు దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి.. సులువైన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 66, క్లాసెన్ 42, రాహుల్ త్రిపాఠి 33, నితీష్ కుమార్ రెడ్డి 37 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు.. పంజాబ్ బౌలర్లో అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శశాంక్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.