SRH Vs RR Qualifier 2: రాజస్థాన్ పై గెలవాలంటే.. సన్ రైజర్స్ ఆ పని చేయాలి

కోల్ కతా జట్టు తో జరిగిన క్వాలిఫైయర్ - 1 మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయింది.. మరోవైపు రాజస్థాన్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరును మట్టి కరిపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 24, 2024 12:43 pm

SRH Vs RR Qualifier 2

Follow us on

SRH Vs RR Qualifier 2: ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు.. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో అమీ తుమీ తేల్చుకొనుంది. క్వాలిఫైయర్ -2 లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆదివారం కోల్ కతా తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. దీంతో అటు రాజస్థాన్, ఇటు హైదరాబాద్ జట్లు విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నాయి.

కోల్ కతా జట్టు తో జరిగిన క్వాలిఫైయర్ – 1 మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయింది.. మరోవైపు రాజస్థాన్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరును మట్టి కరిపించింది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు రంగంలోకి దిగుతోంది.. చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఆ మైదానానికి తగ్గట్టుగా రాజస్థాన్ జట్టు అద్భుతమైన స్పిన్నర్లను రంగంలోకి దింపుతున్నది. స్థానిక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, మరో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ రాజస్థాన్ జట్టుకు కొండంత బలంగా మారనున్నారు. అయితే వీరిని హైదరాబాద్ ఆటగాళ్లు ఎదుర్కోవడం పైనే .. ఎస్ఆర్ హెచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో గెలవడం హైదరాబాద్ జట్టుకు అత్యవసరం. కాబట్టి హైదరాబాద్ ఆటగాళ్లు తమ స్థాయికి మించి ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సత్తా చాడాల్సి ఉంది. లీగ్ దశలో పంజాబ్ జట్టుపై, ప్లే ఆఫ్ మ్యాచ్ లో కోల్ కతా పై హెడ్ దారుణమైన ఆటతీరు ప్రదర్శించాడు. వరుసగా డక్ ఔట్ గా వెనుతిరిగాడు. దీంతో ఈ మ్యాచ్ లో హెడ్ తప్పనిసరిగా రాణించాల్సి ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు గెలిచిన మ్యాచ్లలో హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శించారు. రికార్డు స్థాయిలో విజయాలు అందించారు. హైదరాబాద్ తరఫున హెడ్ (533), అభిషేక్ శర్మ (470) ఆరెంజ్ క్యాప్ విభాగంలో టాప్ స్కోరర్ లు గా కొనసాగుతున్నారు.

రాజస్థాన్ జట్టులో చాహల్, బౌల్ట్, అశ్విన్ వంటి ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు. వారిని హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కచ్చితంగా కాచుకోవాల్సి ఉంటుంది. భారీ స్కోరు చేయాలంటే హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెన్ వంటి వారు రాణించాల్సి ఉంది. నితీష్ రెడ్డి అంతకుముందు రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 76* పరుగులతో ఆకట్టుకున్నాడు . అతడు అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తే సన్ రైజర్స్ కు తిరుగు ఉండదు.

ఇక బౌలింగ్ విభాగంలో కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి వారు రాణిస్తున్నారు. వీరికి మిగతా బౌలర్ల నుంచి సహకారం లభించడం లేదు. హసరంగ స్థానంలో జట్టులోకి వచ్చిన విజయ్కాంత్ వియస్కాంత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అతని స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో విఫలమైన సన్వీర్ సింగ్ ను పక్కనపెట్టి జయదేవ్ ఉన ద్కత్ ను ఆడిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ జట్టు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సంజు సాంసన్, రియాన్ పరాగ్ వంటి వారిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పై కచ్చితంగా హైదరాబాద్ జట్టుకు పట్టు చిక్కుతుంది. చెన్నైలో వాతావరణం మారిన నేపథ్యంలో.. ఒకవేళ వర్షం కురిస్తే.. ఇబ్బంది తప్పదు కాబట్టి.. హైదరాబాద్ జట్టు పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగడం అత్యంత ముఖ్యం.