Jai sha : జై షా వారసుడు ఎవరు? బీసీసీఐ కార్యదర్శి రేసులో ఉన్నది ఎవరంటే?

ప్రపంచ క్రికెట్ ను మరోసారి భారత్ శాసించబోతోంది. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ కు ప్రధాన ఆదాయ వనరుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి మారింది. అనేక చిన్న చిన్న జట్లకు ఆర్థికంగా ఊతం అందిస్తోంది. అయితే త్వరలోనే ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బీసీసీఐ సెక్రటరీ జై షా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 27, 2024 8:57 pm

BCCI New Secretary after Jai sha

Follow us on

Jai sha :  ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నిక కావడం దాదాపు లాంచనమే. ఎందుకంటే 16 మంది సభ్యులలో 15 మంది జై షాకు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 35 సంవత్సరాలు. అయితే నామినేషన్ దాఖలు విషయంలో ఇంతవరకు జై షా స్పష్టత ఇవ్వలేదు. నామినేషన్ వేసేందుకు ఈనెల 27 ఆఖరి తేదీ. స్పోర్ట్స్ వర్గాల ప్రచారం ప్రకారం జై ఎన్నిక కావడం దాదాపు లాంచనమే. అయితే అతడు ఐసీసీ అధ్యక్షుడయితే.. అతడి స్థానంలో బీసీసీఐ సెక్రటరీగా ఎవర్ని నియమిస్తారనేది సందిగ్ధంగా మారింది. పోటీ తీవ్రంగా ఉండడంతో ఎంపిక సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. బీసీసీఐ సెక్రటరీ రేసులో ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా.. ఇలా చాలామంది పోటీలో ఉన్నారు. అయితే వీరంతా రాజకీయ పలుకుబడి, ఇంకా గట్టి నేపథ్యం కలిగి ఉన్నవారు. జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించ కంటే ముందే ఆయన స్థానాన్ని కొత్త వారితో భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కష్టకాలంలో ఆదుకున్నారు

కొంతకాలంగా భారత క్రికెట్ బోర్డుకు జై షా సెక్రటరీ గా సాగుతున్నారు. భారత క్రికెట్ ను విస్తృతం చేయడంలో ఆయన విజయవంతమయ్యారు. కష్టకాలంలో తన వ్యూహ చతురత ద్వారా భారత క్రికెట్ జట్టును ఒడ్డున పడేయగలిగారు. వచ్చే ఏడాది పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా ఆడాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఐసీసీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిగింది. ఒకానొక దశలో భారత జట్టు పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొంటుందనే వార్తలు వినిపించాయి. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోదని జై షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఐసీసీ ఎదుట ఈ విషయాన్ని బలంగా వాదించడంలో జై షా విజయవంతమయ్యారు. దీంతో పాకిస్తాన్ ఆశలు ఆడియాసలయ్యాయి.

విస్తృతంగా గాలిస్తున్న బీసీసీఐ

జై షా తర్వాత ఆ స్థాయిలో వ్యూహ చతురతను అమలు చేసే వ్యక్తి కోసం ప్రస్తుతం బీసీసీఐ విస్తృతంగా గాలిస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గట్టి వ్యక్తిని జై షా స్థానంలో నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఈ రేసులో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నాడు. రోహన్ జెట్లీ కూడా తన తండ్రిలాగే న్యాయవాది. నాలుగు సంవత్సరాల క్రితం అతడు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. జై షా కు రోహన్ అత్యంత సన్నిహితుడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రోహన్ కు బిసిసిఐ సెక్రటరీ పదవి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ వర్గాలు ఇంతవరకు పెదవి విప్పలేదు.