Srilanka Vs Netherlands: టి20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న జట్లల్లో శ్రీలంక కూడా ఒకటి. అయితే ఆ జట్టు వరుస ఓటములు ఎదుర్కొని.. పరువు తీసుకుంది. సూపర్ -8 వెళ్లకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. బలమైన బ్యాటింగ్, మెరుగైన బౌలింగ్ ఉన్నప్పటికీ.. ఆ జట్టు అన్ని విభాగాలలో తేలిపోయింది. అయితే సోమవారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై గెలుపును అందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక .. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి, 201 పరుగులు చేసింది. చరిత్ అసలంక 21 బంతుల్లో 46, కుషాల్ మెండిస్ 29 బంతుల్లో 46 పరుగులు చేయడంతో.. శ్రీలంక భారీ స్కోరు సాధించింది. బౌలర్లు పండగ చేసుకుంటున్న టీ20 ప్రపంచ కప్ లో.. తొలిసారిగా శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నెదర్లాండ్స్ బౌలింగ్ ను ఒక ఆట ఆడుకున్నారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ సత్తా చాటారు.. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ రెండు, కింగ్మా ఒక వికెట్ దక్కించుకున్నారు.
202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్.. 16.4 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. నెదర్లాండ్స్ జట్టులో మైకేల్ లేవిట్ 23 బంతుల్లో 31, స్కాట్ ఎడ్వర్డ్స్ 24 బంతుల్లో 31 పరుగులు చేసి, టాప్ స్కోరర్ లు గా నిలిచారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో నెదర్లాండ్స్ ఏ దశలోనూ శ్రీలంకకు పోటీ ఇవ్వలేకపోయింది. శ్రీలంక బౌలర్లు నువాన్ తుషార 3, పతిరణ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ నిప్పులు చెరిగే విధంగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు వణికిపోయారు.. ఈ మ్యాచ్లో గెలిచి.. టి20 వరల్డ్ కప్ లో తన ప్రస్థానాన్ని శ్రీలంక జట్టు విజయంతో ముగించింది.
శ్రీలంకకు అతిపెద్ద విజయం
టి20 క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి పెద్ద విజయం. 2012లో జింబాబ్వేపై హంబన్ టోట వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 82 పరుల తేడాతో విజయం సాధించింది. 2022లో గీలాంగ్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 79 పరుగులతో విజయం సాధించింది. 2021లో అబుదాబి వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 70 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.