Sri Lanka Vs Afghanistan: రెండో టి20 లో విజయం.. వరుసగా మూడో కప్ కైవసం

దంబుల్లా వేదికగా జరిగిన సోమవారం రాత్రి జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 51 పరుగులు చేసి సమర విక్రమ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Written By: Suresh, Updated On : February 20, 2024 1:14 pm
Follow us on

Sri Lanka Vs Afghanistan: శ్రీలంకలో ఆఫ్ఘనిస్తాన్ పప్పులు ఉడకడం లేదు. అటు వన్డేలు, ఇటు టీ_20 లలో ఆ జట్టు పేలవ మైన ప్రదర్శన కొనసాగిస్తున్నది. దంబుల్లా వేదికగా సోమవారం రాత్రి జరిగిన రెండో టి20లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఏకంగా 72 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. మూడు టీ_20 ల సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లు గెలవడంతో శ్రీలంక సిరీస్ ఒడిసి పట్టేసింది. ఈ విజయంతో వరుసగా మూడు సిరీస్ లు గెలుచుకున్న ఘనతను శ్రీలంక జట్టు సాధించింది.

దంబుల్లా వేదికగా జరిగిన సోమవారం రాత్రి జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 51 పరుగులు చేసి సమర విక్రమ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు.. 5 వికెట్ల వరకు గొప్ప భాగస్వామ్యాలేమీ నమోదు చేయలేదు. 49 -2, 86 -3, 110 -4, 121 – 5 ఇలా వరుసగా శ్రీలంక జట్టు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆరో వికెట్ కు మాథ్యూస్, సమర విక్రమ 66 పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో శ్రీలంక జట్టు 37 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు తీశారు. ఫరూఖ్, నవీన్ తలా ఒక వికెట్ తీశారు.

188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 115 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కరీం జనత్ (28) టాప్ స్కోరర్ గా నిలిచాడు, నబీ(27) పరుగులు చేశాడు. మిగతా వారు కనీసం రెండు అంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, బినారా ఫెర్నాండో, హస రంగ, తీక్షణ, పతి రానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. సొంతం మైదానం కావడంతో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీంతో ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లు క్రీజ్ లో నిలబడేందుకే ఆపసోపాలు పడ్డారు. ఇక నామమాత్రమైన మూడో టీ – 20 దంబుల్లా వేదికగా బుధవారం జరుగుతుంది. ఇప్పటికే లంక టెస్ట్, వన్డే సిరీస్ గెలుచుకుంది..