SRH Vs RR 2024: ఒక్క పరుగు హైదరాబాద్ ఆశలను బతికించింది.. భువనేశ్వర్ ను హీరోను చేసింది..

ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ప్రారంభించింది.. మూడు వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. హెడ్ 58, నితీష్ కుమార్ రెడ్డి 76, క్లాసెన్ 42* అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 3, 2024 7:54 am

SRH Vs RR 2024

Follow us on

SRH Vs RR 2024: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. హైదరాబాద్ జట్టు విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ జట్టుతో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ మధ్య గెలుపు దక్కించుకుంది. ఒక్క పరుగు తేడాతో విక్టరీ అందుకొని.. పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలోకి చేరుకుంది.. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ గట్టెక్కింది. చివరి బంతికి భువి వికెట్ తీసి హైదరాబాద్ కు గెలుపు కిరీటం అందించాడు.

ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ప్రారంభించింది.. మూడు వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. హెడ్ 58, నితీష్ కుమార్ రెడ్డి 76, క్లాసెన్ 42* అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అనంతరం టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసి, ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 67, రియాన్ పరాగ్ 77 రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, నటరాజన్ చెరో రెండు వికెట్లు సాధించారు.. 202 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు మొదట్లోనే గట్టిదెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్లు జోస్ బట్లర్ (0) క్యాచ్ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ క్రీజ్ లోకి వచ్చి అద్భుతంగా ఆడారు.. వాస్తవానికి ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జైస్వాల్ ఇచ్చిన కాచిన మిడ్ హాఫ్ లో ఉన్న ప్యాట్ కమిన్స్ వదిలేశాడు. ఈ జీవ దానంతో జైస్వాల్ రెచ్చిపోయాడు. వేగంగా పరుగులు చేశాడు.. ఇక నటరాజన్ వేసిన ఆరో ఓవర్ లో రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్ ను ఎక్స్ ట్రా కవర్స్ లో ఉన్న అభిషేక్ శర్మ పట్టుకోలేకపోయాడు. ఇద్దరికీ లైఫ్ లు లభించడంతో కుదురుకున్నారు. చెత్త బంతులను ఫోర్లు, సిక్స్ లు గా మలిచారు. ఈ క్రమంలో జైస్వాల్, హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్న క్రమంలో 14 ఓవర్లో నటరాజన్ బౌలింగ్ లో అనవసర షాట్ ఆడబోయి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా ఇదే తరహాలో వికెట్ నష్టపోయాడు. దీంతో మూడో వికెట్ కు నమోదైన 133 పరుగుల భాగస్వామ్యం బ్రేక్ అయింది.

ఈ దశలో రియాన్ పరాగ్ హిట్ మేయర్ తో కలిసి ఎదురుదాడికి దిగాడు. అయితే పరాగ్ జోరుకు కమిన్స్ కళ్లెం వేశాడు. అద్భుతమైన బంతి వేయడంతో.. పరాగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పోవేల్, హిట్ మేయర్ దాటిగా ఆడారు. హిట్ మేయర్ ను నటరాజన్ అవుట్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు విజయ సమీకరణం 12 బంతుల్లో 20 పరుగులకు చేరుకుంది. కమిన్స్ వేసిన 19 ఓవర్లో ధృవ్ జురెల్ కొట్టిన బంతిని అభిషేక్ శర్మ బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. 19 ఓవర్లో చివరి ఐదు బంతుల్లో కమిన్స్ 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్ లో రాజస్థాన్ కు 13 రన్స్ అవసరమయ్యాయి. భువి వేసిన ఈ ఓవర్ లో పోవెల్ ఓ ఫోర్, రెండు “టుడీ” లు తీశాడు. చివరి బంతికి పోవెల్ ను ఔట్ చేసి గెలుపును పూర్తి చేశాడు.