SRH Vs RR 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ ను నిర్ధేశించినప్పటికీ అదరలేదు.. బెదరలేదు. చివరి బంతి వరకు పోరాడి మరి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది హైదరాబాద్ జట్టు. రైజర్స్ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దూకుడు చూపించగలిగితే ప్లే ఆప్స్ కు చేరుకోవడం సాధ్యమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఆదివారం రాత్రి జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. తప్పక గలవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో గొప్ప విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. భారీ లక్ష్యమే అయినప్పటికీ హైదరాబాద్ జట్టు ఏమాత్రం తడబడకుండా పోరాటం సాగించింది. తుది వరకు పోరాడి అంతిమంగా విజయాన్ని దక్కించుకుంది హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ బ్యాటర్ల తెగింపు ధోరణికి క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు.
భారీ లక్ష్యాన్ని విధించిన రాజస్థాన్ జట్టు..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యమే అయినప్పటికీ హైదరాబాద్ జట్టు సులభంగానే ఛేదించింది. చెప్పుకోదగిన హిట్టర్లు లేకపోయినప్పటికీ చివరి 12 బంతుల్లో ఏకంగా 41 పరుగులను సాధించి అధరహో అనిపించింది హైదరాబాద్ జట్టు. చివరి రెండు ఓవర్లలో ఓవర్ కు 20కి పైగా పరుగులు చేయాల్సిన దశ నుంచి సన్ రైజర్ మ్యాచ్ కాపాడుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు. 19వ ఓవర్ లో మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఉన్న మ్యాచును ఉన్న ఫలంగా లాగేసుకున్నాడు గ్లెన్ ఫిలిప్. ఈ సీజన్లో అతను ఆడిన తొలి మ్యాచ్ ఇదే. వరుసగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు.
చెలరేగిపోయిన గ్లెన్ ఫిలిప్..
ఫిలిప్ విధ్వంసకర ఆటగాడే అయినప్పటికీ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడించలేదు. భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసిన బ్రూక్ ను వరుసగా మ్యాచ్ ల్లో ఆడించింది హైదరాబాద్ జట్టు. ఘోరంగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాలను కల్పించింది. అయితే, ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టమవుతున్న తరుణంలో.. మిగిలిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన దశలో ఫిలిప్ ను ఆడించింది హైదరాబాద్ జట్టు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 19 వ ఓవర్ లో తొలి మూడు బంతులను సిక్సులుగా మలిచాడు ఫిలిప్. నాలుగో బంతి బుల్లెట్ వేగంతో బౌండరీ లైన్ దాటించాడు. మొత్తంగా ఆ ఓవర్ లో 24 పరుగులు రాబట్టుకుంది హైదరాబాద్ జట్టు. అయితే మంచి షాట్లతో అలరిస్తున్న ఫిలిప్ అవుట్ కావడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది.
సత్తా చాటిన అబ్దుల్ సమద్..
హైదరాబాద్ జట్టు విజయానికి చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో అబ్దుల్ సమద్ ఉన్నాడు. భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం సమద్ కు ఉండడంతో హైదరాబాద్ జట్టు ఆశలు పెట్టుకుంది. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతిని సిక్సుగా మలిచాడు సమద్. మూడో బంతికి మళ్లీ రెండు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి సింగిల్ తీశాడు మార్కో జెన్ సేన్. చివర బంతిని సందీప్ శర్మ నో బాల్ వేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. అదనంగా వచ్చిన ఆ బంతిని బౌలర్ తల మీదుగా లాంగాన్ లో భారీ సిక్సు కొట్టి జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు సమద్. ఐపీఎల్ చరిత్రలోనే థ్రిల్లర్ గా మిగిలిపోయే మ్యాచ్ ఇది. అనూహ్యంగా లభించిన ఈ విజయంతో హైదరాబాద్ జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో గొప్ప విజయాన్ని అందించి పెట్టిన ఫిలిప్, సమద్ లోకల్ గా పేర్లు పెట్టేసారు అభిమానులు. ఫలక్ నుమా ఫిలిప్, షేక్ పేట్ సమద్ గా వారికి నామకరణాలు చేసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.