Janasena – Chevireddy : కుమారుడికి రాజకీయ బాధ్యతలు అప్పగించి తాను అధినేత వద్ద శేష జీవితం గడిపేయాలని చూస్తున్నారు వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి. చంద్రగిరి నుంచి వరుసగా గెలస్తూ వస్తున్న ఆయన కుమారుడికి లైన్ క్లీయర్ చేశారు. అటు అధినేత జగన్ సైతం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. అందుకే తాడేపల్లి ప్యాలెస్ కు మకాం మార్చారన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి లేని లోటును తీర్చాలని జగన్ ను అభ్యర్థించడంతో ఆయన సమ్మతించినట్టు సమాచారం. అందుకే ఇటీవల రెండు, మూడు క్లిష్ట ఎపిసోడ్లలో సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు చెవిరెడ్డి కూడా కనిపించారు. ఆ నలుగురు టీమ్ లో కొత్తగా వచ్చి చేరారు. దీంతో చెవిరెడ్డి స్టేట్ లీడర్ గా మారడం ఖాయమని తెలుస్తోంది.
అవినీతి చిట్టా..
అయితే చెవిరెడ్డి రాజకీయ ఉన్నతిని కోరుకుంటున్న తరుణంలో ఆయనకు చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జనసేన నుంచి ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన అవినీతి.. ఆయన కుటుంబ అక్రమాలపై చిట్టా విప్పింది జనసేన. ఎమ్మెల్యే చెవిరెడ్డి అవినీతిని సాక్ష్యాలతో తాము ప్రశ్నించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు జనసేన జిల్లా కార్యదర్శి మనోహర్.. రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి. ఈ సందర్భంగా వారు చెవిరెడ్డికి కొన్ని కీలక ప్రశ్నల్ని సంధించారు.2019లో మీ అప్పులెంత..? 2023లో మీ ఆస్తులెంత? మీ కొడుకుల సూట్ కేస్ కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడివి? 2019 ఎన్నికల అఫిడవిట్ లో మీ ఇద్దరు కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు. ఇప్పుడు వాటిని గుర్తుచేస్తూ జనసేన నేతలు చెవిరెడ్డిని తగులుకుంటున్నారు.
లోతుగా విమర్శలు..
అయితే చాలా రకాలుగా శూల శోధన చేసి జనసేన విమర్శల పర్వానికి దిగుతోంది. కానీ చెవిరెడ్డి నుంచి నో రియాక్షన్. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ వేల కోట్లు విలువైన 22 ఎకరాల మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తారా? తుడా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? గడప గడపకు తిరగాల్సిన అవసరం లేదు.. ఏదైనా ఒక సెంటర్లో నిలబడి సమస్యలు అడిగితే కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి” అంటూ జనసేన నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడికి రాజకీయ బాధ్యతలు అప్పగించి తప్పుకుందామని భావిస్తున్న చెవిరెడ్డికి జనసేన రూపంలో ఎదురైన విమర్శలు, ఆరోపణలు ఓకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రియాక్షన్ ఎలా ఉంటుందో?
జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరు ఉన్న నేతల్లో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ పక్కనే ఉన్న ఆయన.. విపక్షంలో ఉన్న వేళలో నాటి టీడీపీ ప్రభుత్వంలో సర్కారు తీరుపై ఒంటికాలిపై విరుచుకుపడే అతి కొద్ది నేతల్లో చెవిరెడ్డి ఒకరు. జగన్ ప్రభుత్వం ఏర్పడినంతనే మంత్రి పదవి దక్కుతుందని చాలామంది అంచనా కట్టారు. అందుకు భిన్నంగా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో కాస్తంత ఆచితూచి అన్నట్లుగా చెవిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన టార్గెట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చెవిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.