SRH Vs RCB IPL 2024: ఓటమి నుంచి విజయం పుడుతుంది. హేళన నుంచి విజయ దరహాసం ఉద్భవిస్తుంది. సోమవారం నాటి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ విధ్వంసం వెనుక కూడా అలాంటి కథే ఉంది. ఈ మ్యాచ్ లో హెడ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి బెంగళూరు బౌలర్లకు పీడకలను మిగిల్చాడు. మైదానానికి వచ్చిందే ఆలస్యం దూకుడే మంత్రమైనట్టు.. ఎదురు దాడే అందుకు మార్గం అన్నట్టు ఆడాడు. అతడు సృష్టించిన సునామీలో బెంగళూరు బౌలర్లు ప్రేక్షక పాత్రకు మిగిలిపోయారు. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు ఎదురు దాడికి దిగిన హెడ్.. మైదానంలో శివతాండవం చేశాడు. హెడ్ పరాక్రమం ఆ స్థాయిలో జరిగింది కాబట్టే హైదరాబాద్ 287 పరుగులు చేసింది. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం కొద్ది రోజులకే ఆ రికార్డును మళ్ళీ తనే తిరగ రాసింది.
హెడ్ చేసిన సెంచరీ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్. 41 బాల్స్ ఎదుర్కొన్న అతడు 102 రన్స్ చేశాడు. 39 బాల్స్ లోనే అతడు సెంచరీ కొట్టేశాడు. 9 బౌండరీలు, 8 సిక్సర్లు అతని ఇన్నింగ్స్ లో ఉన్నాయి. బౌలర్లను లెక్కచేయకుండా బంతిని బాదడమే హెడ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు.. ఈ క్రమంలో సెంచరీ సాధించి.. దానిని విభిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన తలకు ధరించిన హెల్మెట్ తీసి ఎడమ చేతితో పట్టుకున్నాడు. దానిని బ్యాట్ కొనకు తగిలించాడు. తల కిందికి వంచి అందరికీ నమస్కారం అన్నట్టుగా తలవంచాడు. వాస్తవానికి ఇలాంటి వైవిధ్యమైన సెలబ్రేషన్స్ కు క్రిస్ గేల్ ఆద్యుడు అని చెప్పవచ్చు. 100 పరుగులు చేసిన తర్వాత గేల్ ఇలాగే సంబరాలు చేసుకునేవాడు. దానిని హెడ్ పునరావృతం చేశాడు.
హెడ్ సెలబ్రేషన్స్ వెనక పెద్ద స్టోరీ ఉంది. హెడ్ తన ఐపీఎల్ ఎంట్రీని బెంగళూరు జట్టు ద్వారా ఇచ్చాడు. అప్పట్లో అతడికి ఎక్కువగా అవకాశాలు వస్తుండేవి కావు. ఆ తర్వాత అతడిని నుంచి తొలగించారు. అవకాశాలు ఇవ్వకపోగా.. జట్టు నుంచి తొలగించడం పట్ల అతడు నామోషీగా అనుకున్నాడు. ఇంకేముంది సోమవారం నాటి మ్యాచ్ తో బెంగళూరు పై తన ప్రతీకారం తీర్చుకున్నాడు. అది కూడా బెంగళూరు సొంత మైదానంలో. అందుకే సెంచరీ అనంతరం బెంగళూరు మాజీ బ్యాటర్ గేల్ ను హెడ్ అనుకరించాడు. బ్యాట్ కోసం హెల్మెట్ ధరించి.. మైదానంలో ప్రేక్షకులకు తన తలవంచి అభివందనం చేశాడు.