SRH Vs RCB IPL 2024: ఇది బౌలింగా.. ఇదే బౌలింగా.. పోయి గల్లీల్లో ఆడుకోపొండి

బెంగళూరు బౌలింగే బాగోలేదు అనుకుంటే.. ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ, హెడ్ 49 బాల్స్ లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే.. రెండో వికెట్ కు హెడ్ క్లాసెన్ 26 బంతుల్లోనే 57 పరుగుల పార్టనర్ షిప్ జత చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 7:56 am

SRH Vs RCB IPL 2024

Follow us on

SRH Vs RCB IPL 2024: ఈ ఐపీఎల్ సీజన్ బెంగళూరు జట్టుకు కలిసి రావడం లేదు. వరుస ఓటములతో ఆ జట్టు ఇబ్బంది పడుతోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.. అలాగని అనామక ఆటగాళ్లు ఉన్నారా అంటే.. ఒక్కొక్కరు బ్యాటింగ్ తో అద్భుతాలు చేయగలరు . బంతులతో మ్యాజిక్ చేయగలరు. తమదైన రోజు ఆట స్వరూపాన్ని మార్చేయ గలరు. కానీ అలాంటి ఆటగాళ్లు తేలిపోతున్నారు. వరుసగా ఓడిపోతూ నవ్వుల పాలవుతున్నారు. బ్యాటింగ్ పర్వాలేదనిపించినప్పటికీ కీలక సమయాల్లో ఆటగాళ్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక బౌలింగ్ గురించి ప్రస్తావించకపోవడమే మంచిది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో బౌలింగ్ చేయలేదు. ఇక ముందు చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు 287 పరుగులు చేశారంటే బెంగళూరు బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సీజన్లో ఇప్పటివరకు టోప్లీ మెరుగ్గా బౌలింగ్ చేశాడు.. కానీ సోమవారం నాటి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇతడి ఎకానమీ 17 గా నమోదయింది.. ఇక ఇదే జట్టులో మహిపాల్ లామ్రోర్ ఒకటంటే ఒకటే ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక వైశాక్ విజయ్ కుమార్ 4 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇతడి ఎకానమీ ఏకంగా 16గా నమోదయింది.. లోకిస్ పెర్గూ సన్ 4 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇతడు రెండు వికెట్లు కూడా తీశాడు కాబట్టి కొంతలో కొంత మినహాయింపు ఇవ్వవచ్చు.. ఇతడి ఎకానమీ కూడా దాదాపు 13 గా నమోదయింది. యష్ దయాల్ నాలుగు ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతడి ఎకానమీ 12.75 గా నమోదయింది. ఇలా ప్రతీ బౌలర్ పదికి మించి ఎకానమీ నమోదు చేశారు. వాస్తవానికి బెంగళూరు మైదానం పేస్ బౌలర్లకు పెద్దగా సహకరించదు. అలాంటప్పుడు కెప్టెన్ డూ ప్లెసిస్ స్పిన్నర్లతో బౌలింగ్ వేయించి ఉంటే ప్రయోజనం ఉండేది. కానీ అలా కాకుండా పాస్ట్ బౌలర్లతో బౌలింగ్ వేయించడం వల్ల హైదరాబాద్ ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు.

బెంగళూరు బౌలింగే బాగోలేదు అనుకుంటే.. ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ, హెడ్ 49 బాల్స్ లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే.. రెండో వికెట్ కు హెడ్ క్లాసెన్ 26 బంతుల్లోనే 57 పరుగుల పార్టనర్ షిప్ జత చేశారు. ఇక మూడో వికెట్ కు క్లాసెన్ మార్క్రమ్ 27 బంతుల్లో 66 పరుగులు జోడించారు. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్, మార్క్రం 19 బాల్స్ లో 56 పరుగులు జోడించారు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో హైదరాబాద్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 287 రన్స్ చేసింది. ఇందులో బెంగళూరు బౌలర్లు ఏకంగా 15 పరుగులను ఎక్స్ ట్రా ల రూపంలో సమర్పించుకున్నారు. ఏకంగా 12 వైడ్ బాల్స్ వేశారు. బెంగళూరు బౌలింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి..”పరుగులు సమర్పించుకునేందుకే బౌలింగ్ వేస్తున్నట్టు ఉంది. పోయి గల్లీలో ఆడుకోపొండని” నెటిజన్లు విమర్శిస్తున్నారు.