SRH Vs MI IPL 2025: ప్రస్తుత ఐపీఎల్ లో హెడ్ ఒక పట్లగా లేడు. గత సీజన్ మాదిరిగా అతనిలో దూకుడు లేదు. ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందులో మెరుపులు లేవు. ఉరుములు లేవు.. ప్రళయ గర్జనలు లేవు. ఆ వేగాన్ని పక్కనపెట్టి హెడ్ ఏదో స్ట్రైక్ రొటేటర్ పాత్ర పోషిస్తున్నాడు.. అతడి ఆట తీరును చూస్తుంటే.. ఆడుతోంది హెడ్డేనా అనే అనుమానం కలుగుతున్నది.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో హెడ్ 29 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి.
Also Read: కాటేరమ్మ కొడుకుల్లో ఉత్సాహం తగ్గిందా? ఏంటీ నీరసం?
ఏవీ ఆ మెరుపులు
వాస్తవానికి హెడ్ బ్యాటింగ్ తెలిసిన ఎవరైనా సరే అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోరుకోరు. కనీసం ఊహించరు.. అతనితో పాటు బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అభిషేక్ శర్మ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అంతకుముందు మ్యాచ్లో అతడు విఫలమైనప్పటికీ.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో అతని బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సహాయంతో 40 పరుగులు చేశాడు. కానీ హెడ్ మాత్రం దూకుడు కొనసాగించలేకపోయాడు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో హెడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కాకపోతే ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయాడు. చివరికి ప్రీ హిట్ ను కూడా హెడ్ ఉపయోగించుకోలేకపోయాడు. విల్ జాక్స్ ఊరించే బంతి వేస్తే.. హెడ్ దాన్ని అంచనా వేయలేక అమాంతం గాల్లో లేపాడు. దానిని శాంట్నర్ అద్భుతంగా అందుకున్నాడు. వాస్తవానికి జీవదానం లభించిన ఆటగాడు ఇలాంటి చెత్త షాట్లు ఎంపిక చేసుకోడు. కానీ ఆడటం ఇష్టం లేదన్నట్టుగా.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పని ఉందన్నట్టుగా.. హెడ్ ఆట తీరు ప్రదర్శించాడు. అభిషేక్ శర్మ అప్పటికే అవుట్ కావడం..ఇషాన్ కిషన్ కూడా వెళ్లిపోవడంతో.. ఏమాత్రం బాధ్యత లేకుండా హెడ్ ఆడాడు. కనీసం దూకుడును కూడా ప్రదర్శించలేకపోయాడు. ఇక హెడ్ కు తగ్గట్టుగా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశాడు. హెడ్డే దరిద్రంగా ఆడుతున్నాడు అనుకుంటే.. నితీష్ కుమార్ రెడ్డి అంతకుమించి అన్నట్టుగా ఆడాడు. ఫలితంగా వీరిద్దరి భాగస్వామ్యంలో హైదరాబాద్ జట్టు ఏమాత్రం ముందడుగు వేయలేకపోయింది. కనీసం వేగంగా పరుగులు కూడా చేయలేకపోయింది. ఇద్దరు స్ట్రైక్ రొటేట్ మినహా.. గొప్పగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. అందువల్లే హైదరాబాద్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
గత సీజన్లో..
గత సీజన్లో హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ముంబై జట్టుపై బీభత్సంగా పరుగులు చేశాడు. కానీ ఈసారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. తన సహజ శైలి ఆట తీరు పూర్తిగా మర్చిపోయాడు. ఏదో టెస్టు తరహా బ్యాటింగ్ చేస్తూ.. చూస్తున్న ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు. ఇలా ఆడితే మాత్రం అటు హైదరాబాద్ జట్టుకు మాత్రమే కాదు.. ఇటు చూస్తున్న హైదరాబాద్ అభిమానులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వేగంగా పరుగులు తీసి.. ప్రత్యర్థి ఆటగాళ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే హెడ్ ఇలా ఆడటాన్ని హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇలా ఆడితే హైదరాబాద్ ప్లే ఆఫ్ ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గ్రేట్ అభిషేక్.. ఆట తీరుతోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ మనసులు గెలిచావ్.. వైరల్ ఫోటో