Abhishek Sharma: ప్రస్తుత సమాజంలో ఎదుగుదలకు కారణమైన వారిని ఏదో ఒక సందర్భంలో వదిలించుకుంటున్నారు. గొప్ప స్థానాలు అందించిన వారిని పక్కన పెడుతున్నారు. మొత్తంగా చూస్తే అవసరం ఉన్నంతవరకే వాడుకుంటున్నారు. ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఫలితంగా సాటి మనిషికి మరో మనిషిపై గౌరవం తగ్గుతోంది. ప్రేమ కరువవుతోంది. బంధాలు, అనుబంధాలు ఇన్ స్టెంట్ వస్తువులుగా మారుతున్నాయి. అయితే ఈ తరహా సంఘటనలు సామాన్య మనుషులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఎదురవుతున్నాయి. అందువల్లే బంధాలు అన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అవసరాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కొంతమంది మాత్రం తమ ఎదుగుదలకు కారణమైన వ్యక్తులను మర్చిపోరు. తమకు గొప్పదనం రావడానికి తోడ్పడిన మనుషులను దూరం పెట్టరు. పైగా ప్రతి సందర్భంలో వారిని గుర్తు చేసుకుంటారు. కళ్ళముందు తారస పడితే కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలియజేస్తారు.. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు అభిషేక్ శర్మ.
Also Read: అమ్మా కావ్య పాప.. నితీష్, ఇషాన్ కు ఇచ్చిన అవకాశాలు చాలు!
కన్నీళ్లతో కృతజ్ఞతలు
అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత టి20 జట్టులో కీలక ఆటగాడు. వరుసగా అవకాశాలు పొందుతూ.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఒకప్పుడు అభిషేక్ శర్మ కు ఈ స్థాయిలో అవకాశాలు రాలేదు. జట్టులో స్థిరమైన స్థానం లభించలేదు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఎక్కడో తేడా కొట్టి.. అతడు జట్టులో కీలక ఆటగాడిగా ఆవిర్భవించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే సూర్య కుమార్ యాదవ్ కు టి20 పగ్గాలు చేతికి అందాయో.. అప్పుడే అభిషేక్ శర్మ రూపు రేఖలు మారిపోయాయి. వరుసగా అవకాశాలు రావడం.. వాటిని సద్వినియోగం చేసుకోవడంతో అభిషేక్ శర్మ టి20లలో ఓపెనింగ్ ఆటగాడిగా స్థిరపడిపోయాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్న అభిషేక్ శర్మ.. గురువారం ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు తారసపడ్డాడు. కెప్టెన్ సూర్యను చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్ళతో నీవల్లే ఇదంతా అన్నట్టుగా అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు గట్టిగా అతడిని ఆలింగనం చేసుకొని తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు అభిషేక్ శర్మను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆటతీరుతోనే కాదు.. వ్యక్తిత్వం లోనూ అభిషేక్ శర్మ ఆదర్శంగా నిలిచాడని పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 40 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు ఉన్నాయి. అతడు ఉన్నంతసేపు హైదరాబాద్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. ముంబై జట్టుపై కూడా హైదరాబాద్ 200కు మించి పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. అభిషేక్ అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
Also Read: కాటేరమ్మ కొడుకుల్లో ఉత్సాహం తగ్గిందా? ఏంటీ నీరసం?