SRH Vs MI 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ మైదానంలో హైదరాబాద్, ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. అభిమానులను మ్యాచ్ కు మూడు గంటల ముందు నుంచే మైదానంలోకి నిర్వాహకులు అనుమతించారు. హైదరాబాద్ జట్టు ఆడుతున్న నేపథ్యంలో మ్యాచ్ చూసేందుకు హాజరైన అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ ప్రకటించింది.
ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైళ్ళు నడిచే సమయాన్ని పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ ఎస్ రెడ్డి ప్రకటించారు. ఉప్పల్ మార్గంలో చివరి రైలు అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి ఒంటిగంట పది నిమిషాలకు డెస్టినేషన్ పాయింట్ చేరుకుంటుందని వివరించారు. ఆ సమయంలో నడిచే మెట్రో రైల్లో నాగోల్, ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ లో మాత్రమే ప్రయాణికులకు అనుమతి ఉంటుందని.. మిగతా స్టేషన్ లలో ద్వారాలు మూసి ఉంటాయని మెట్రో ఎండీ ప్రకటించారు.
మెట్రో మాత్రమే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ ను పురస్కరించుకొని ఆర్టీసీ కూడా శుభవార్త చెప్పింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానుల కోసం ప్రత్యేకమైన బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు వివరించింది. అర్ధరాత్రి పూట ప్రయాణ సమయంలో ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు ఉప్పల్ మైదానానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని.. మ్యాచ్ అనంతరం రాత్రి 11:30 నిమిషాలకు స్టేడియం నుంచి ఇతర ప్రాంతాలకు బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు. ఈ సౌకర్యాలను అభిమానులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.