SRH Vs KKR Final 2024: మరికొద్ది గంటలో ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నై లోని చెపాక్ మైదానం వేదికగా ఆదివారం రాత్రి 7:30 నుంచి కోల్ కతా, హైదరాబాద్ జట్లు కప్ కోసం పోటీ పడనున్నాయి. గడిచిన సీజన్లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ, ఈ సీజన్లో అంచనాలకు మించి రాణించింది. బలమైన ముంబై, బెంగళూరు జట్లపై 277, 287 పరుగులు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాదు ఢిల్లీ జట్టుపై పవర్ ప్లే లో ఏకంగా 125 రన్స్ చేసింది.. క్వాలిఫైయర్ -1 లో కోల్ కతా జట్టు పై ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫైయర్ -2 లో రాజస్థాన్ జట్టుపై విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. 2016లో డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఇప్పటివరకు మరోసారి కప్ దక్కించుకోలేదు. కేన్ విలియమ్సన్ ఆధ్వర్యంలో 201లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. చెన్నై చేతిలో ఓడిపోయింది.. ఇక ప్రస్తుతం ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో కోల్ కతా పై గెలిచి, కప్ దక్కించుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భావిస్తోంది.
ఫైనల్ లో కోల్ కతా జట్టు ను ఓడించడం హైదరాబాద్ కు అంత ఈజీ కాదు.. ఈ సీజన్లో లీగ్, ప్లే ఆఫ్ లో జరిగిన రెండు మ్యాచ్లలో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది.. ఇప్పటివరకు 27 మ్యాచ్లు హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరిగాయి. కోల్ కతా 18 మ్యాచ్లలో గెలిస్తే.. హైదరాబాద్ 9 మ్యాచ్లో మాత్రమే విజయాన్ని దక్కించుకుంది.. పాత గణాంకాల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు సైతం కోల్ కతా నే గెలుస్తుందని చెబుతున్నారు. మరోవైపు హోరాహోరీగా సాగే ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు.. కెప్టెన్ కమిన్స్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని వారు అంచనా వేస్తున్నారు. నాకౌట్ లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కమిన్స్ కు గట్టి పట్టు ఉందని.. అది హైదరాబాద్ జట్టుకు లాభం చేకూర్చుతుందని వారు అంచనా వేస్తున్నారు.. ఆస్ట్రేలియా కెప్టెన్ గా కమిన్స్ వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను అందించాడు.. చెన్నై వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్ లోనూ అతడు అదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
కోల్ కతా పై జరిగే ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ గెలుపొందాలని.. తెలుగు అభిమానులు పూజలు చేస్తున్నారు. గుడికి వెళ్లి దేవుడికి అభిషేకం చేయించడంతోపాటు, కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. సన్ రైజర్స్ సత్తా చాటాలని దేవున్ని మొక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇక హైదరాబాద్ జట్టు 2009లో గిల్ క్రిస్ట్ ఆధ్వర్యంలో తొలిసారి కప్ దక్కించుకుంది. 2016లో డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజేతగా నిలిచింది. 2018లో కేన్ విలియంసన్ కెప్టెన్సీలో హైదరాబాద్ ఫైనల్ వెళ్లినప్పటికీ.. చెన్నై చేతిలో ఓడిపోయింది.