SRH vs GT : ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఏ ఒక్క ఆటగాడు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో.. హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది.. మ్యాచ్ చూస్తున్న హైదరాబాద్ అభిమానులు నిరాశతో తలదించుకున్నారు. కొందరైతే మధ్యలోనే వెళ్లిపోయారు.. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఐపీఎల్ కెరియర్ లోనే (4/17) నాలుగు వికెట్లు పడగొట్టి.. అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.. తద్వారా 2023లో మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై (4/21) నమోదు చేసిన గణాంకాలను అధిగమించాడు. మొత్తంగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. బౌన్స్ ను సరిగ్గా ఉపయోగించుకుంటూ హెడ్(8), అభిషేక్ శర్మ (18), అనికేత్ వర్మ (18), సమర్జిత్ సింగ్ (0) వికెట్లను పడగొట్టి.. ఉప్పల్ మైదానంపై సరికొత్త చరిత్ర సృష్టించాడు.. అంతకుముందు బెంగళూరు జట్టుపై బెంగళూరు మైదానంలో మూడు వికెట్లు పడగొట్టి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
Also Read : సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
అందువల్లే అతనిలో ఆ కసి
మహమ్మద్ సిరాజ్ ఈ స్థాయిలో విజృంభించడం వెనక ప్రధాన కారణం.. అతడిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం.. దానికంటే ముందు జరిగిన మెగా వేలంలో బెంగళూరు జట్టు నిలుపుకోకపోవడం.. ఇవి అతనిలో కసి పెంచాయి. ఇక ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లోనూ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం లభించలేదు. దీంతో అతడిలో కసి పెరిగింది. ఎలాగైనా సరే తన పూర్వపు ఫామ్ అందుకోవాలని సిరాజ్ భావించాడు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. అయితే పంజాబ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో సిరాజ్ 4 ఓవర్లు వేసి.. ఒక్క వికెట్ కూడా తీయకుండా 54 పరుగులు ఇచ్చాడు. దీంతో అతనిపై విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో సిరాజ్ 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సిరాజ్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు బెంగళూరు పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొత్తంగా జాతీయ జట్టులో స్థానం కోసం సిరాజ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపై మునుముందు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాల్సి ఉంది.
Also Read : సన్ రైజర్స్ ఓపెనర్లు ఇక మారరా..ఇదేం దరిద్రం?!