KKR vs SRH : నోటి దాకా వచ్చిన ముద్ద ఆకస్మాత్తుగా దూరమైతే ఎలా ఉంటుంది.. చేయి దాకా వచ్చిన కప్ చేజారితే ఎలా అనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ పరిస్థితిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనుభవిస్తోంది. లీగ్ దశలో హోరాహోరీగా ఆడిన హైదరాబాద్ జట్టు.. కీలకమైన ఫైనల్ లో తేలిపోయింది. పోటాపోటీగా ప్రదర్శన ఇవ్వాల్సిన చోట..కోల్ కతా ముందు తలవంచింది. కనీసం 120 పరుగులు కూడా చేయలేకపోయింది. పూర్తిస్థాయిలో ఓవర్లు కూడా ఆడలేక పోయింది.. దీంతో కప్ కలను కల్లలు చేసుకుంది. హైదరాబాద్ ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం..కోల్ కతా బౌలర్లకు దాసోహం అన్నట్టుగా హైదరాబాద్ బ్యాటర్లు వ్యవహరించడం అభిమానులను నివ్వెర పరుస్తోంది.
హైదరాబాద్ జట్టు ఓటమికి బ్యాటర్ల వైఫల్యం కారణం ఒకటైతే.. కెప్టెన్ కమిన్స్ టాస్ గెలిచి.. బ్యాటింగ్ వైపు మొగ్గుతూ తీసుకున్న తప్పుడు నిర్ణయం మరో కారణమని మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్.. పిచ్ పరిస్థితిని గమనించకుండా బ్యాటింగ్ తీసుకోవడం కోల్ కతా కు కలిసి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ధృవీకరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు అతడు ధన్యవాదాలు కూడా తెలిపాడు. హైదరాబాద్ కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయమే తమ విజయానికి బాటలు వేసిందని అతడు పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం కోల్ కతా బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు.. దీంతో హైదరాబాద్ ఓటమికి కమిన్స్ కారణమని.. కొంతమంది అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇంకా కొందరైతే హైదరాబాద్ జట్టు ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే రంగంలోకి దిగిందని ఆరోపణలు చేస్తున్నారు.
చాలామంది అనుకున్నట్టుగా కమిన్స్ బ్యాటింగ్ ను ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం కాదట. ఎందుకంటే బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న స్లో వికెట్ పై.. మామూలు లక్ష్యం నమోదు చేసినప్పటికీ.. విజయం సాధించొచ్చనే ఎత్తుగడ ఉందట. తుది పోరు లో తలపడుతున్నప్పుడు.. ప్లేయర్లపై వాస్తవంగానే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలో చేజింగ్ చేయడం చాలా కష్టమని భావించే కమిన్స్ బ్యాటింగ్ వైపు మొగ్గాడట. ముందుగా బ్యాటింగ్ చేస్తే 160 నుంచి 170 మధ్యలో పరుగులు తీసి.. సునాయాసంగా గెలవచ్చని భావించాడట. డ్యూ ప్రభావం లేకపోవడంతో క్వాలిఫైయర్ -2 లో రాజస్థాన్ జట్టును మట్టికరిపించినట్టు…కోల్ కతా పై కూడా గెలవచ్చని అనుకున్నాడట.. కానీ కమిన్స్ ఒకటనుకుంటే.. మైదానం మరో విధంగా మారింది. కోల్ కతా కు పూర్తిగా సహకరించింది. హైదరాబాద్ బ్యాటర్ల బలహీనతకు తగ్గట్టుగా…కోల్ కతా బౌలర్లు బౌలింగ్ వేసి ఫలితం రాబట్టారు. వరుసగా వికెట్లు తీసి కోలుకోకుండా దెబ్బ తీశారు. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి వంటి వారి వికెట్లను త్వరగా తీసి, మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీజన్ మొత్తంలో అద్భుతంగా ఆడిన హైదరాబాద్ ఆటగాళ్లు.. చివరి అంచెలో మాత్రం చేతులెత్తేశారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ కోల్ కతా బౌలర్లకు దాసోహం అన్నది. దీంతో హైదరాబాద్ జట్టు దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఒకవేళ హైదరాబాద్ కెప్టెన్ చెప్పినట్టు 160 కి పైగా పరుగులు చేసి ఉంటే.. మ్యాచ్ లో అనూహ్య ఫలితం వచ్చేదేమో.