Spain vs England : హోరాహోరీగా సాగిన మ్యాచ్.. నువ్వా నేనా అనేలా జరిగిన మ్యాచ్.. ఊపిరి బిగబట్టేలా.. ఉత్కంఠను పెంచేలా చేసిన మ్యాచ్.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది.. ఒత్తిడి తట్టుకోలేక గోర్లను కోరుక్కునేలా చేసింది. చివరికి ఈ పోరులో స్పెయిన్ విజేతగా ఆవిర్భవించింది..బెర్లిన్ వేదికగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన యూరో కప్ ఫైనల్లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టును 2-1 తేడాతో మట్టి కరిపించింది. మొత్తంగా నాలుగోసారి యూరో కప్ దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
యూరో కప్ టోర్నీలో స్పెయిన్ ఓటమనేదే లేకుండా ఫైనల్ దాకా వచ్చింది.. బలమైన జట్లను మట్టికరిపించి రారాజుగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే సత్తా చాటింది. “బంతిపై నియంత్రణ.. కిక్.. ప్రత్యర్థి గోల్డ్ పోస్ట్ పై పదేపదే దాడి” వంటి ఆట తీరులను ప్రదర్శించి వారెవ్వా అనిపించింది.. ఇంగ్లాండ్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్పెయిన్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో తొలి అర్ధ భాగంలో జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఏ జట్టు కూడా గోల్ సాధించలేకపోయాయి. రెండవ అర్ద భాగంలో మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాలకే స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ అద్భుతమైన గోల్ సాధించి ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఈ దశలో ఇంగ్లాండ్ జట్టు గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే స్పెయిన్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మ్యాచ్ 73 వ నిమిషం వద్ద ఇంగ్లాండ్ ఆటగాడు కోలె పాల్ మెర్ అద్భుతమైన గోల్ సాధించడంతో ఆ జట్టు ఖాతా తెరిచింది. ఫలితంగా జట్ల స్కోర్లు 1-1 సమం అయ్యాయి.. ఈ దశలో మ్యాచ్ పెనాల్టీ షూట్ అవుట్ కు దారి తీస్తుందని ప్రేక్షకులు భావించారు. ఈ దశలో స్పెయిన్ ఆటగాడు మైఖేల్ ఓయర్జబాల్ ఆట 86 నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో స్పెయిన్ మరోసారి లీడ్ లోకి దూసుకెళ్లింది.
రెండు జట్ల స్కోర్లు 2-1 గా ఉన్న క్రమంలో అదనపు గోల్ చేసేందుకు ఇంగ్లాండ్ కు అవకాశం ఇవ్వకపోవడంతో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయం ద్వారా నాలుగోసారి స్పెయిన్ విజేతగా ఆవిర్భవించింది. ఈ యూరో కప్ లోనూ ఇంగ్లాండ్ రన్నరప్ గా నిలిచింది. ఈసారి టోర్నీ లోనూ ఫైనల్ వెళ్లినప్పటికీ ఇంగ్లాండ్ రాత మారలేదు. కీలక దశలో ఆ జట్టు ఆటగాళ్లు గోల్ చేయలేకపోవడంతో ఇంగ్లాండ్ ఓటమి బాట పట్టాల్సి వచ్చింది. ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో గెలిచిన ఆనందంలో స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు.
ఇటలీ వేదికగా 2020-21 సీజన్లో జరిగిన యూరో కప్ లో ఇటలీ విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. వరుసగా రెండు ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోయిన జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. స్పెయిన్ జట్టు 2008 ఆస్ట్రియా – స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన యూరో కప్ ఫైనల్ మ్యాచ్లో జర్మనీ పై విజయం సాధించింది. 2012 లో ఉక్రెయిన్ – పోలాండ్ వేదికగా జరిగిన యూరో కప్ లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఇటలీపై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు సీజన్లలో యూరో కప్ సాధించి స్పెయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది.. 1964లో స్పెయిన్ వేదికగా జరిగిన యూరో కప్ లో సోవియట్ యూనియన్ (ఉమ్మడి రష్యా) పై గెలుపొంది తొలిసారిగా.. విజేతగా ఆవిర్భవించింది. తాజాగా ఇంగ్లాండ్ పై విజయం ద్వారా మొత్తంగా నాలుగోసారి యూరో కప్ సాధించిన చరిత్రను స్పెయిన్ సృష్టించింది.