South Africa: టి20 వరల్డ్ కప్ ఉత్కంఠ గా సాగుతోంది. పసి కూన జట్లు ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, స్కాట్లాండ్ వరుస విజయాలతో అదరగొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్, అమెరికా పాకిస్తాన్, స్కాట్లాండ్ న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించాయి. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లీగ్ దశ నుంచి నిష్క్రమించే స్టేజికి చేరుకున్నాయి.. మరోవైపు ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక టాప్ క్లాస్ జట్లుగా పేరుపొందిన ఇండియా, ఆస్ట్రేలియా అదరగొడుతున్నాయి. అయితే ఈ జట్లకు పోటీని ఇచ్చే టీం గా దక్షిణాఫ్రికా రూపాంతరం చెందింది. విశ్లేషకులు అంచనా ప్రకారం టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా కంటే ఈ జట్టు అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది.
క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా టీంకు చోకర్ అనే పేరు ఉంది. గ్రూప్ సి లో ఉన్న ఈ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో గెలిచి సూపర్ -8 కు వెళ్లిన తొలి టీం గా రికార్డు సృష్టించింది. మార్క్రం ఆధ్వర్యంలో ఈ జట్టు ఈసారి సమష్టి తత్వాన్ని ప్రదర్శిస్తోంది. కీలక సమయంలో నిదానంగా ఆడుతూ విజయం వైపు పరుగులు తీస్తోంది. ఆడిన తొలి మ్యాచ్లో శ్రీలంక, రెండవ మ్యాచ్లో నెదర్లాండ్స్, మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్ పై గెలిచి హ్యాట్రిక్ సాధించింది.. దీంతో ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ -8 కు వెళ్లిపోయింది. రబాడా, నోకియా, క్లాసెన్, కేశవ్ మహారాజ్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న మైదానాలపై.. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు మ్యాచ్ విన్నర్ గా అవతరిస్తున్నారు. స్టబ్స్, మిల్లర్, క్లాసెన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.. సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లు న్యూయార్క్ వేదికగానే తలపడింది. అయితే ఈ మైదానంపై పరుగులు సాధించడం దక్షిణాఫ్రికా జట్టుకు అంత ఈజీ కాలేదు. అయినప్పటికీ తుది వరకు నిదానంగా ఆడే విజయాలను సాధించింది.
ఇక ప్రస్తుత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రం విభిన్నమైన వ్యూహాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గతంలో అండర్ -19 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా జట్టును అతడు విజేతగా నిలిపాడు.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. కీలకమైన సమయాలలో అసాధారణ నిర్ణయాలు తీసుకొని, జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదే జోరు దక్షిణాఫ్రికా జట్టు కొనసాగిస్తే టి20 వరల్డ్ కప్ సాధించడం పెద్ద విషయం కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.