Ravi Shastri Ganguly: మంచి ఊపు మీద కనిపించిన టీమిండియా(Team India) జట్టు ఇంగ్లండ్(England) పర్యటనలో సిరీస్ లో ఆల్ రెడీ 2-1తో ముందంజలో ఉంది. ఆ సిరీస్ ఐదో టెస్టును డ్రా చేసుకున్నా.. విజయం సాధించినా దశాబ్ధాల చరిత్రను తిరగరాసిన జట్టుగా టీమిండియా నిలబడేది. అప్పుడెప్పుడో 70 వ దశకం తర్వాత టీమిండియాకు ఇంగ్లండ్ లో సిరీస్ విజయం దక్కలేదు. ఇప్పుడు దక్కితే అదో అపూర్వ విజయం కిందే లెక్క. కానీ ఐదో టెస్టు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తోపాటు ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ సైతం వైరస్ బారినపడ్డారు.
ఇక ఐదోటెస్టుకు ముందు ఆటగాళ్లతో సాన్నిహిత్యంగా మెలిగిన మరో ఫిజియో యోగేశ్ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో భారత ఆటగాళ్లు అంతా భయపడిపోయారు. తాము ఐదో టెస్టు ఆడలేమని బీసీసీఐకి తెలిపి వైదొలిగారు. ఇదో పెద్ద వివాదమైంది.
అయితే ఇదంతా జరగడానికి కారణం రవిశాస్త్రి, కోహ్లీ అని తేలింది. వీళ్లు బసచేసిన హోటల్ లో ఓ పుస్తకావిష్కరణ జరగగా దానికి రవిశాస్త్రి, కోహ్లీ హాజరయ్యారు. బీసీసీఐ అనుమతి లేకుండానే బయటకు వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాకే రవిశాస్త్రి కరోనా బారినపడడం.. ఆ తర్వాత ఇతర టీమిండియా సభ్యులకు సోకడంతో టెస్టు వాయిదా పడింది.
ఈ క్రమంలోనే రవిశాస్త్రిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అందరి నుంచి వినిపించింది. బీసీసీఐ అనుమతి లేకుండా వెళ్లారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీలు డిమాండ్ చేశారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (Sowrav Ganguly) మాత్రం దీన్ని వెనకేసుకొచ్చాడు. కరోనా బాయోబబుల్ లో ఉండడం చాలా కష్టమని.. ఎంత సేపు అని హోటల్ గదుల్లో ఉంటారని.. ఒక రోజంతా ఇంట్లో, హోటళ్లలో ఉండడం కష్టమని.. బయటకు వెళ్లకుండా ఎవరిని ఆపలేమన్నారు.
ఒకరి స్వేచ్ఛను హరించడం జరగని పని అని గంగూలీ స్పష్టం చేశారు. నేనూ ఈ మధ్య షూటింగ్ లో పాల్గొంటే 100 మంది అక్కడున్నారు.. అందరూ డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతోంది.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారినపడుతున్నారు.. మన జీవన విధానం ఇలా తయారైంది అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
రవిశాస్త్రి అనుమతి తీసుకోకుండా వెళ్లాడని తెలిసు అని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ స్పష్టం చేశారు. ఇంగ్లండ్ తో రద్దయిన ఐదో టెస్టును ఎప్పుడు నిర్వహించినా.. దాన్ని ఆఖరి టెస్టుగానే పరిగణిస్తామని గంగూలీ తెలిపారు. దీంతో ఈ అతిపెద్ద వివాదం కాస్త సద్దుమణిగినట్టైంది. రవిశాస్త్రి తప్పు లేదని.. చర్యలు లేవన్న సంగతి తేటతెల్లమైంది.