
Tollywood, AP Govt : తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణలో అన్నీ సానుకూల అంశాలే. టికెట్ రేట్ల నుంచి సీటింగ్ కెపాసిటీ వరకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. ఏపీ విషయానికి వచ్చే సరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన టికెట్ రేట్ల నుంచి సీటింగ్ ఆక్యుపెన్సీ వరకు పలు సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడంలో భాగంగా సీఎం జగన్ ను కలిసేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండానే.. మరో పిడుగులాంటి సమస్యను ఇండస్ట్రీ నెత్తిన వేసింది ఏపీ సర్కారు. అదే.. సినిమా టికెట్ల అమ్మకం. సినిమా టికెట్లను ఇక ప్రభుత్వమే విక్రయిస్తుందని, ఇందుకోసం ఆన్ లైన్ పోర్టల్ ఒకటి తీసుకురాబోతున్నట్టు జీవో విడుదల చేయడంతో.. సినీపరిశ్రమకు ఊహించని షాక్ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పెద్దలకు టైమ్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. అందరి చూపూ ఈ మీటింగ్ పైనే పడింది.
ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు చెప్పుకోవడానికి.. ఏపీ సర్కారు సినీ ప్రముఖులకు ఆ మధ్యనే ఆహ్వానం పంపింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో.. సమస్యల చిట్టాను సిద్ధం చేసుకున్నారు సినీ ప్రముఖులు. ఆ తర్వాత మంత్రి కూడా హైదరాబాద్ వచ్చి, చిరంజీవిని కలిసి వెళ్లారు. దీంతో.. ఇక మీటింగే తరువాయి అనుకున్నారు. కానీ.. ఎంత సేపటికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో.. ఏం జరుగుతోంది? అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. అటు సర్కారు కానీ.. ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఎవ్వరూ ఈ విషయమై స్పందించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో.. బాంబు పేల్చింది జగన్ సర్కారు. ఎలాగైనా సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ఒప్పించాలని చిత్ర పరిశ్రమ చూస్తుంటే.. ఏకంగా టికెట్ల అమ్మకం మొత్తం తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అయితే.. ఎవ్వరూ దీనిపై ఓపెన్ గా కామెంట్ చేయలేదుగానీ.. సినీ పరిశ్రమ మొత్తం దీనికి ససేమిరా అంటోంది.
టికెట్లను ప్రభుత్వం విక్రయిస్తే.. ఆ డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందో అనే టెన్షన్ ఉంది. ఈ పని చేసినందుకుగానూ కమీషన్ రూపంలో ఎంత తీసుకుంటుంది? అన్నది కూడా భయం ఉంది. ఆలస్యమైనా, మరో కారణం ఏమైనా.. ఎదురు ప్రశ్నించడానికి ఉండదు. ఇన్ని భయాల నడుమ.. సర్కారు తెచ్చిన ఈ టికెట్ల విక్రయ విధానాన్ని చిత్ర పరిశ్రమ మొత్తం వ్యతిరేకిస్తోందని అంటున్నారు.
మరి, దీనిపై జగన్ సర్కారు ఏమంటుంది? అన్నది అర్థంకాకుండా ఉంది. ఇప్పటికే.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. జీవో కూడా ఇచ్చేసింది. అలాంటప్పుడు వెనకడుగు వేస్తుందా? నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందా? అనే చర్చ సాగుతోంది. ఈ విధమైన పరిస్థితుల్లో టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ తో సమావేశం కానుండడం ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 20వ తేదీన జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. మరి, ఈ భేటీలో ఏం తేలుతుంది? సినీ పెద్దలు ఎలాంటి ఫలితంతో వెనుదిరుగుతారు అన్నది చూడాలి.