ఐపీఎల్… అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ప్రేక్షకులకు పసందైనా వినోదాన్ని పంచుతోంది. కరోనా కారణంగా ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఐపీఎల్ ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. ఇండియాలో జరగాల్సిన మ్యాచ్‌లు కూడా దుబాయికి షిఫ్ట్ అయిపోయాయి. ఆట ఆలస్యమైనా.. ఆటలో మాత్రం ఏ తేడా లేదు. అవే బౌండరీలు.. అవే సిక్సర్లు. స్టేడియంలో అభిమానులు లేకున్నా.. టీవీల ముందు కూర్చున్న వారు మాత్రం విజిల్స్ వస్తూనే ఉన్నారు.
Also Read: బంతి బంతికి బౌండరీ..చెన్నై టీం ఫామ్‌లోకి వచ్చినట్లే..!
అయితే.. దుబాయి అంటేనే డిఫరెంట్ వాతావరణం. ఐపీఎల్ ఆటగాళ్లను ఇప్పుడు అక్కడి వాతావరణం ఓ ఆట ఆడేసుకుంటోంది. ఓ వైపు మంచు కురుస్తూనే.. మరో వైపు ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్లేయర్స్ డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. వీటన్నింటికి తోడు ఇప్పుడు ఆయా జట్ల క్రికెటర్లను గాయాలు వేధిస్తున్నాయి.
ఐపీఎల్‌లో కీలకమైన ఆటగాళ్లు భువనేశ్వర కుమార్ (హైదరాబాద్), అమిత్ మిశ్రా (ఢిల్లీ) గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భునేశ్వర్ లేకపోవడం హైదరాబాద్‌కు పెద్ద లోటనే చెప్పాలి. భువి ఐపీఎల్ కే కాదు, ఆ తరువాత జరగబోయే ఆస్ట్రేలియా ట్రిప్‌కూ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మిచెల్ మార్ష్ గాయంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం వల్లే అంబటి రాయుడు (చెన్నై) రెండు మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడిపోయింది. రాయుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనేది ఆ జట్టు అభిప్రాయం కూడా. బ్రావో ( చెన్నై), ఇషాంత్ శర్మ (దిల్లీ) టోర్నీ ప్రారంభానికి ముందే గాయాల బారిన పడ్డారు. బ్రావో కాస్త కోలుకుని చెన్నైకి అందుబాటులోకి వచ్చాడు. అయితే తాను ఇంకా ఫిట్‌నెస్ అందుకోవాల్సి ఉంది. ఇషాంత్ శర్మ మాత్రం ఇంకా ఆటకు సిద్ధం కాలేదు. టోర్నీలో మూడొంతుల మ్యాచ్‌లు కూడా పూర్తికాలేదు.
Also Read: క్రికెటర్లకు ‘ముచ్చెమటలు’ పట్టిస్తున్న దుబాయ్ వెదర్
ఇప్పుడే ఇంతమంది కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడితే.. మున్ముందు పరిస్థితి ఏంటి? ఇప్పటికే కరోనా ఉధృతితో లాక్‌డౌన్ అమలు చేయగా.. లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ప్లేయర్స్ ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో వారి ఫిట్‌నెస్ కూడా గతి తప్పింది. తగినంత ప్రాక్టీసు లేకుండా మైదానంలో దిగినందుకే ఇలా గాయాలు పలకరిస్తున్నాయనేది విశ్లేషకుల మాట.