SA Women Vs India Women: నాడు ధోని, విరాట్.. నేడు స్మృతి, కౌర్.. ఈ కనెక్టివిటీ గురించి వింటే ఆశ్చర్యం కలిగించక మానదు..

Smriti Mandhana , Harmanpreet Kaur 3 వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండవ వన్డేలో భారత జట్టు 325 పరుగులు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 11:15 am

Harman Preet Kaur, Smriti Mandana Jersey Virat Dhoni

Follow us on

SA Women Vs India Women: “పోలీసే కాదు.. ఒంటిమీద వేసుకున్న యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తది” విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పే డైలాగ్ అది. దీనిని క్రికెట్ పరిభాషకు మార్చుకుంటే.. క్రికెటరే కాదు, అథ్లెట్స్ ధరించిన జెర్సీ కూడా ఆటాడేస్తది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. దీనిని మరోసారి నిరూపించారు టీమిండియా మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణులు స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్..

3 వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండవ వన్డేలో భారత జట్టు 325 పరుగులు చేసింది . ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చివరి వరకు పోరాడింది. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసి.. నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్ వార్డ్ 135*, మరి జన్నె కాప్ 114 సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ.. చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి తలవంచింది.. దీంతో భారత్ ఉత్కంఠ మధ్య విజయాన్ని సాధించింది. సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే, 2-0 తేడాతో గెలుచుకుంది.

అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. ఆకాశమేహద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 103 నాట్ అవుట్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన 120 బంతుల్లో 136 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేలలో భారత మహిళా జట్టు తరఫున ఇది ఒక రికార్డ్. ఇది మాత్రమే కాదు, మరో ఘనతను కూడా స్మృతి, హర్మన్ ప్రీత్ కౌర్ తమ పేరు మీద లిఖించుకున్నారు. కౌర్ 7, స్మృతి 18 నెంబర్లు కలిగిన జెర్సీలను ధరించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

టీమిండియా పురుషుల జట్టులో గతంలో కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని ఏడవ నెంబర్ జెర్సీ, విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీ ధరించేవారు. వీరిద్దరు కూడా టీమిండియా విజయాలలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి అబేధ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. 2010లో మీర్ పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగో వికెట్ కు విరాట్ కోహ్లీ – ధోని 152 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు విజయాన్ని అందించారు. 2016లో మొహాలీ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ – ధోని ద్వయం మూడో వికెట్ కు 151 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత జట్టుకు ఘన విజయాన్ని అందించింది.

బుధవారం బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఏడవ నెంబర్ జెర్సీ ధరించిన హర్మన్ ప్రీత్ కౌర్, 18వ నెంబర్ జెర్సీ ధరించిన స్మృతి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయా. వీరిద్దరూ మూడో వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. స్మృతి మందాన మొదటి వన్డే లో సెంచరీ చేయగా.. రెండవ వన్డేలోనూ అదే ఫామ్ కొనసాగించింది.. వీరిద్దరి ద్వయం ధోని, విరాట్ మాదిరి జెర్సీలను ధరించారని.. నాడు వారిద్దరూ కెప్టెన్, వైస్ కెప్టెన్ గా ఉన్నారని.. ఇప్పుడు హార్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన కూడా అలానే వ్యవహరిస్తున్నారని.. ఆ నంబర్ల జెర్సీలను కూడా వేసుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సామాజిక మాధ్యమాలలో విరాట్ – ధోని, హర్మన్ ప్రీత్ కౌర్- స్మృతి మందాన ను పోల్చుతూ ఓ ఫోటోను పోస్ట్ చేయడం విశేషం.