Homeక్రీడలుక్రికెట్‌SL vs IND : అనుకున్నదే అయింది.. గౌతమ్ గంభీర్ చెప్పి మరీ కొట్టాడు.. పాపం...

SL vs IND : అనుకున్నదే అయింది.. గౌతమ్ గంభీర్ చెప్పి మరీ కొట్టాడు.. పాపం హార్దిక్.. రెంటికి చెడ్డ రేవడయ్యాడు..

SL vs IND : టి20 వరల్డ్ కప్ గెలిచి.. జింబాబ్వే పై T20 కప్ సాధించి.. జోరు మీద ఉన్న టీమిండియా.. త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి జట్టు కూర్పు దాదాపుగా పూర్తయింది. కొద్దిరోజులుగా నలుగుతున్న తుది బృందం కసరత్తు ముగిసింది. దీంతో శ్రీలంకలో పర్యటించే భారత జట్టును గురువారం సాయంత్రం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టు ప్రకటనకు ముందు హార్దిక్ పాండ్యా పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ బిసిసిఐ సంచలన ప్రకటన చేసింది. జట్టు కెప్టెన్ గా టి20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాను బీసీసీఐ పక్కన పెట్టింది. టి20 టోర్నీ సారధిగా సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది. అటు వన్డే, ఇటు టి20 టోర్నీలకు వైస్ కెప్టెన్ గా గిల్ ను నియమించారు. దీంతో హార్దిక్ పాండ్యా కు డబుల్ స్ట్రోక్ తగిలినట్టయింది. హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ టీమిండియా కూర్పు పట్ల తనబైన ముద్ర వేశాడు..కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా కు శ్రీలంకతో ఆడే భారత జట్టులో చోటు ఉండేలా చూశాడు.. ఇక టి20 వరల్డ్ కప్ తోడ్నీకి దూరమైన సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు వన్డే ఫార్మాట్ కీపర్ గా అవకాశం కల్పించాడు.. జూలై 28న పల్లెకెలే మైదానంలో టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 2 కొలంబోలోని ప్రేమదాస మైదానంలో జరిగే మ్యాచ్ ద్వారా వన్డే సిరీస్ మొదలవుతుంది.

అనుకున్నదే అయింది

వాస్తవానికి శ్రీలంక సిరీస్ కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ టోర్నీ ఆడబోడని తెలిసింది. కానీ అవేవీ నిజం కాదని తేలింది. శ్రీలంకతో జరిగే టోర్నీలలో ఆడే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అందులో హార్దిక్ పాండ్యా పేరును పొందుపరిచింది. దీంతో హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రతిభ చూపాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అవేవీ బీసీసీఐ పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. దీనికి తోడు గౌతమ్ గంభీర్ మొదటి నుంచి కూడా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ పై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. 2012లో సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో కోల్ కతా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నాడు. ఆ ఏడాది కోల్ కతా ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీల్లో షాట్లు కొట్టి, sky గా పేరుపొందాడు.. సూర్య కుమార్ యాదవ్ లో ఆ టాలెంట్ గుర్తించి బయటికి తీసిన ఘనత గౌతమ్ గంభీర్ కే దక్కుతుంది. అందుకే నాటి నుంచి గౌతమ్ గంభీర్ కు సూర్య కుమార్ యాదవ్ అంటే ప్రత్యేక అభిమానం.

కోచ్ అయిన వెంటనే..

టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడైన వెంటనే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.. ఇందులో భాగంగానే కోల్ కతా ఆటగాళ్లకు సింహభాగం దక్కేలా ప్రణాళిక రూపొందించాడు. శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా కు చోటు దక్కించాడు.. ఇదే సమయంలో టి20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యాను ఆటగాడిగా మాత్రమే ఉంచాడు. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ తో పోల్చితే హార్దిక్ పాండ్యా అన్ని విభాగాలలో రాణించగలడు. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ వేసి.. భారత జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకరమైన మిల్లర్ కు ఫుల్ టాస్ బంతివేసి.. అవుట్ చేశాడు. అయితే మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన రిలే క్యాచ్ పట్టుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభ చూపించినప్పటికీ హార్దిక్ పాండ్యాను దూరం పెట్టడం పట్ల జట్టు మేనేజ్మెంట్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.

టి20 వరల్డ్ కప్ జట్టు ఇదే

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), రింకు సింగ్, రియాన్ పరాగ్, సంజు సాంసన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్.

వన్డే జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఖాళీల్ అహ్మద్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version