Mohammed Siraj: సహజంగా జట్టుకు ఒక ఆటగాడు దూరమైతే.. ఆ బాధ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఆ బాధను మహమ్మద్ సిరాజ్ అనుభవిస్తున్నాడు.. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా అవకాశాలు లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో వేటు ఎదుర్కొన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా భారత జట్టులో పూర్తి స్థాయి ఆటగాడిగా సిరాజ్ కొనసాగాడు. అయితే అకస్మాత్తుగా చోటు కోల్పోవడంతో అతడికే కాదు, అతడి అభిమానులకు కూడా ఏమాత్రం మింగుడు పడటం లేదు. అయితే గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనప్పటికీ సిరాజ్ గణాంకాలు వన్డే క్రికెట్లో మెరుగ్గానే కనిపిస్తున్నాయి. 2022 నుంచి వన్డేలు ఆడుతున్న సిరాజ్ ఇప్పటివరకు 72 వికెట్లు తీశాడు. అంతే కాదు ఈ సమయంలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్ గా ఆవిర్భవించాడు. 2023లో వన్డే ఫార్మాట్లో సిరాజ్ ఏకంగా 47 వికెట్లు నేలకూల్చాడు. వన్డే ప్రపంచ కప్ లో అతడు 11 మ్యాచ్ లు ఆడి, 14 వికెట్లు పడగొట్టాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్లు పడగొడితే.. సిరాజ్ 20 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే బుమ్రా కు సరైన సహకారం అందించకపోవడంతో..మరో ఎండ్ లో మెరుగ్గా బౌలింగ్ లేకపోవడంతో అతని ప్రతిభ పేలవంగా కనిపించింది.
20 వికెట్లు పడగొట్టినప్పటికీ..
20 వికెట్లు పడగొట్టినప్పటికీ ఆస్ట్రేలియాలో సిరాజ్ ప్రదర్శన అంతగా వెలుగులోకి రాలేదు. దీంతో మేనేజ్మెంట్ అతడిని పక్కనపెట్టి యువ పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంది.. కొత్త బంతితో మాత్రమే సిరాజ్ రాణిస్తాడని.. బంతి పాతపడేసరికి అంతగా ప్రభావం చూపించలేడని.. ముఖ్యంగా మిడిల్, చివరి ఓవర్లలో అతడు ఆకట్టుకోలేడని ఇటీవల రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అందువల్లే సింగ్ ను తీసుకున్నట్టు ప్రకటించాడు. బుమ్రాకు సామర్థ్యం కూడా అంతగా లేకపోవడంతో అతడికి బ్యాకప్ గానే సింగ్ ను తీసుకున్నట్టు రోహిత్ వివరించాడు. ఇక జట్టులో చోటు కోల్పోవడంతో సిరాజ్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అందువల్లే అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు.. అందులోకి రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో జనవరి 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడాలని సిరాజ్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తెలియజేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన సిరాజ్ కు విశ్రాంతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు వైద్య బృందం సూచించింది. అయితే తను జట్టులో స్థానం కోల్పోవడంతో.. సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిరాజ్ రంజి ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ క్రికెటర్లు కూడా రంజీ లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కూడా సిరాజ్ చేరిపోయాడు.