Ram Gopal Varma : తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఈయన తీసిన సినిమాలు ఆణిముత్యాలు లాంటివి. శివ ,సత్య, రంగీలా, గాయం, సర్కార్, క్షణక్షణం, రక్త చరిత్ర ఇలా ఒక్కటా రెండా ఎన్నో అద్భుతమైన సినిమాలను చిత్రీకరించి ఆ రోజుల్లోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సందీప్ వంగ సినిమాలను మన యూత్ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. కానీ ఆ సందీప్ వంగ కి అతి పెద్ద ఆదర్శం రామ్ గోపాల్ వర్మ. ఆయన మేకింగ్ స్టైల్ ని విపరీతంగా ఇష్టపడి, ఎలా అయినా సినిమాల్లోకి వచ్చి రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప దర్శకుడిని అవ్వాలి అనే కసితో ఇండస్ట్రీ లోకి వచ్చాడు. అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. నేడు వాళ్లంతా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం దారితప్పాడు.
టెక్నాలజీ పరంగా, షాట్ మేకింగ్ పరంగా దర్శకత్వానికి సరికొత్త నిర్వచనం తెలిపిన రామ్ గోపాల్ వర్మ, ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాలను కేంద్రంగా తీసుకొని సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా ఒకానొక సందర్భంలో బూతు సినిమాలు తీస్తూ తన విలువని పూర్తిగా దిగజారిపోయేలా చేసుకున్నాడు. అయితే కాసేపటి క్రితమే రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ ఆయన అభిమానులకు శుభవార్త అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన మాట్లాడుతూ ‘రెండు రోజుల క్రితమే నేను సత్య సినిమా చూసాను. తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాని మళ్ళీ చూసిన తర్వాత, నేనెందుకు సత్య చిత్రాన్ని ఒక బెంచ్ మార్క్ గా పెట్టుకొని సినిమాలను తీయలేకపోయాను అని నా మీద నాకే అసహ్యం వేసింది. సత్య వంటి గొప్ప చిత్రాన్ని చూసిన తర్వాత నా మీద ప్రేక్షకులు పెట్టుకున్న గొప్ప అంచనాలకు న్యాయం చేయలేకపోయానని ఇప్పుడు అర్థమైంది’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సత్య ఇచ్చిన సక్సెస్ కారణంగా నా కళ్ళు నెత్తికి ఎక్కాయి. ఇష్టమొచ్చినట్టు కథా, స్క్రీన్ ప్లే ని పక్కన పెట్టి, కేవలం జిమ్మిక్కులు చేసి ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేయాలని అనుకున్నాను. సత్య, శివ, రంగీలా , గాయం లాంటి సినిమాలను చూసి, నా ప్రతిభ ని గుర్తించి సినీ పరిశ్రమ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను. సగం జీవితం అయిపోయింది. మిగిలిన సగం జీవితంలో నేను సత్య లాంటి సినిమాలని తీయలేకపోవచ్చు, కానీ నాకు మంచి గౌరవాన్ని అందించే సినిమాలు మాత్రం చేయాలని అనుకుంటున్నాను. ఇది నేను ‘సత్య’ చిత్రం మీద ప్రమాణం చేసి చెప్తున్న సత్యం’ అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. రామ్ గోపాల్ వర్మ కి కలిగిన ఈ జ్ఞానోదయం ని చూసి అభిమానులు ఆయన్ని మెచ్చుకుంటున్నారు.