Shreyas Iyer Winning Secret: వాస్తవానికి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ ఆటగాడయినా సరే తప్పు చేస్తాడు. ఎంతటి గొప్ప ఆటగాడయినా సరే ప్రత్యర్థి బౌలర్లకు ఏదో ఒక సందర్భంలో తలవంచుతాడు. ఫలితంగా మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తర్వాత చేతుల్లో నుంచి జారిపోతుంది. అలాంటి ప్రమాదం నిన్న చాలా సందర్భాల్లో ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు అయ్యర్. తోటి ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాల ముందు చిక్కుకొని విలవిల లాడుతున్న సందర్భంలో.. అతడు మాత్రం అదరగొట్టాడు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాటస్ఫూర్తిని ప్రదర్శించాడు. నిదానంగా ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు. నోటి నుంచి ఒక మాట కూడా బయటికి రాకుండానే విధ్వంసాన్ని సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లు తమ హావభావాలతో రెచ్చగొడుతున్నప్పటికీ.. తను మాత్రం నిదానమే ప్రధానం అనే సామెతను పాటించాడు. తుదివరకు నిలబడి జట్టును గెలిపించాడు. విజయం సాధించిన అనంతరం కూడా అయ్యర్ పెద్దగా రెస్పాండ్ కాలేదు. భీకరమైన సంకేతాలు ఇవ్వలేదు. తోటి ప్లేయర్లు ఇబ్బంది పడేవిధంగా కామెంట్ చేయలేదు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు..
Also Read : గంభీర్ చూస్తున్నావా.. కేకేఆర్ ను గెలిపించింది అయ్యర్.. క్రెడిట్ కొట్టేశావ్ గా..
మ్యాచ్ ముగిసిన తర్వాత.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ కూడా పొదుపు మంత్రాన్ని పాటించాడు. ఏమాత్రం నోరు జారకుండా సులువుగా నాలుగు మాటలు మాట్లాడేసి… వాటిని కూడా అర్థవంతంగా మాట్లాడి వెళ్లిపోయాడు..” క్రికెట్లో ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకపోతే అది క్రికెట్ కాదు. మనం మన మనసును ఎంతవరకు లగ్నం చేయగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి.. అంత తప్ప ఆవేశపడితే ఉపయోగం ఉండదు. ప్రత్యర్థులు ఎలా ఆడతారో తెలిసిన తర్వాత.. మనం కూడా అదే స్థాయిలో బలంగా అడుగులు వేయాలి. బలంగా పోరాటపటిమను చూపించాలి. అనంతరం మన సామర్థ్యాన్ని చివరి వరకు కొనసాగించాలి. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి.. ఒత్తిడిలో ఇబ్బందికి గురికాకూడదు. ఏమాత్రం ఆవేశ పడకూడదు. అప్పుడే మనకంటూ ఒక స్థిరత్వం లభిస్తుందని” అయ్యర్ వ్యాఖ్యానించాడు. గతంలో ఎంతో ఆవేశంగా ఉండే అయ్యర్.. ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చాడు. నిదానమే ప్రధానం అనే సామెతను నిజం చేసి చూపిస్తున్నాడు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా బలమైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు. గతంలో అయ్యర్ ఇంత దూకుడుగా బ్యాటింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నప్పటికీ.. స్థాయిలో మాత్రం కుదురుగా ఎన్నడూ ఆడలేదు. పైగా అతడు ప్రతి సందర్భంలోనూ ఆవేశాన్ని ఎక్కువగా ప్రదర్శించేవాడు. అయితే తొలిసారిగా మౌనంగా ఉండి జట్టును గొప్పగా నడిపించాడు. అవసరమైన సందర్భంలో నిలబడి జట్టు గెలిపించి.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా పంజాబ్ జట్టుకు ఫైనల్ వెళ్లే మార్గాన్ని సుగమం చేశాడు.