Shreyas Iyer opens up: టీమిండియాలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాకపోతే వారికి అవకాశాలు లభించడమే చాలా ఇబ్బందికరంగా మారింది. కొన్ని సందర్భాలలో ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోతే ఆ ప్లేయర్లలో నిరాశ తారస్థాయికి చేరుతుంది. ఎవరిని నిందించాలో తెలియదు. ఎవరిని ప్రశ్నించాలో తెలియదు. దీంతో వారిలో వారే మదన పడుతుంటారు. తమకు తామే బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు. అప్పుడప్పుడు ఏదైనా వేదిక దొరికితే తన మనసులో ఉన్న బాధను మొత్తం బయట పెడతారు.
టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు యూఏఈ వెళ్లిపోయింది. అక్కడ ప్రాక్టీస్ లో మునిగితేలుతోంది. టీమ్ ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. గిల్ ఉప సారధిగా ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆసియా కప్ ఆడే భారత జట్టులో వర్ధమాన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు చోటు లభించలేదు. దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. మేనేజ్మెంట్ ను అయ్యర్ అభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అయితే మొన్నటిదాకా ఈ వ్యవహారం మీద నిశ్శబ్దంగా ఉన్న అయ్యర్.. ఇప్పుడు ఒక్కసారిగా గొంతు విప్పాడు.
ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడాడు. ఆసియా కప్, అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్ లో చోటు లభించకపోవడం పట్ల తన ఆవేదన మొత్తం వ్యక్తం చేశాడు..” కొన్ని సందర్భాల్లో జట్టులో చోటు లభించకపోవడం ఆవేదన కలిగిస్తుంది. ఇబ్బంది కలిగిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరినీ ప్రశ్నించాలో అర్థం కాదు. మన కోపాన్ని ఎవరిమీద ప్రదర్శిస్తే ఏమనుకుంటారో తెలియదు.. అందువల్లే నిదానంగా ఉండాల్సి వస్తుంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జట్టులో చోటు లభించకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. అందువల్లే తదుపరి మ్యాచ్ లలో అవకాశాలు లభిస్తే.. నూటికి నూరు శాతం ప్రతిభ ప్రదర్శించాలి అనిపిస్తుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ సామర్ధ్యాన్ని చూపించాలనిపిస్తుంది. ప్రస్తుతం నా ముందు కూడా అదే ఉంది కాబట్టి.. దానినే అనుసరిస్తానని” అయ్యర్ వ్యాఖ్యానించాడు.
అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయ్యర్ తన ఆవేదన మొత్తం వ్యక్తం చేశాడని.. ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించాలని.. అతడికి అన్యాయం జరగకుండా చూడాలని.. టీమిండియాలో అతడికి స్థానం ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ అయ్యర్ విషయంలో సానుకూల దృక్పథాన్ని పాటిస్తుందా? లేదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.