Shreyas Iyer : 2012, 2014లో ఐపీఎల్ విజేతగా కోల్ కతా జట్టు ఆవిర్భవించింది. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఒక్క ట్రోఫీ కూడా సాధించలేకపోయింది. ఐపీఎల్ ట్రోఫీ కోసం ఆ జట్టు 10 సంవత్సరాలుగా నిరీక్షిస్తోంది. ఆ జట్టు నిరీక్షణకు చెక్ పెడుతూ.. శ్రేయస్ అయ్యర్..కోల్ కతా కు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఈ సీజన్లో తన వ్యూహ చతురతతో హైదరాబాద్ జట్టుపై ఏకంగా మూడుసార్లు కోల్ కతా జట్టును గెలిపించాడు. తద్వారా కోల్ కతా జట్టు పేరు మీద సరికొత్త రికార్డు సృష్టించాడు.
కోల్ కతా ట్రోఫీ సాధించిన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భవిష్యత్తు కెప్టెన్ అతడే అని అభిమానుల నుంచి కామెంట్ల తాకిడి ఎక్కువైంది. చివరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల కానిది కూడా అయ్యర్ సాధించాడనే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే కమిన్స్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచింది. రెండుసార్లు కూడా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు భంగపాటుకు గురైంది. అప్పుడు టీం ఇండియా జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఆస్ట్రేలియా సారధిగా కమిన్స్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్ లోనూ కమిన్స్ దే పై చేయి అవుతుందని.. కచ్చితంగా కోల్ కతా ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ వారందరి అంచనాలను శ్రేయస్ అయ్యర్ తలకిందులు చేశాడు.
శ్రేయస్ అయ్యర్ తన వ్యూహ చతురతతో హైదరాబాద్ జట్టును మట్టికరించాడు. బౌలింగ్లో మార్పులు, చేర్పులు చేసి.. హైదరాబాద్ ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ పూర్తి ఏకపక్షం చేశాడు . ఫలితంగా హైదరాబాద్ 113 రన్స్ మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. ఇదే దశలో స్వల్ప లక్ష్యాన్ని కోల్ కతా ఆడుతూ పాడుతూ చేదించింది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేయలేనిది.. అయ్యర్ తన చేతుల ద్వారా నిరూపించాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. భవిష్యత్తు కెప్టెన్ గా ఎదుగుతాడని కితాబిస్తున్నారు.